ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల టాప్ కమాండర్ మద్వి హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మృతి చెందగా, ఈ ఘటనను కేంద్రంగా చేసుకుని కొత్తగా రాజకీయ–భద్రతా వాదోపవాదాలు మొదలయ్యాయి. పోలీసులు ఈ ఘటనను ఎన్‌కౌంటర్‌గా ప్రకటించినప్పటికీ, మావోయిస్టు పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తూ “నకిలీ ఎన్కౌంటర్”గా అభివర్ణించింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, హిడ్మాను నిరాయుధ స్థితిలో అరెస్ట్ చేసి తరువాత హత్య చేసి దాన్ని ఎన్‌కౌంటర్‌గా చూపించారని ఆరోపించారు. ఈ సంఘటనకు నిరసనగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, ఈ చర్యలకు బలమైన ప్రతిఘటన అవసరమని అభయ్ పేర్కొన్నారు.
ఇక ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ,హిడ్మా ఎన్కౌంటర్ తో మావోయిస్టుల శక్తి బలహీనపడిందని అన్నారు,అటు ఎన్కౌంటర్ జరిగిన రోజులోనే ఆంధ్రప్రదేశ్‌లో మరో చర్యగా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందడం, 50 మందిని అరెస్ట్ చేయడం చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
హిడ్మా హత్య అసలేం జరిగిందన్న దానిపై విభిన్న వాదనలు వెలుగుచూస్తుండగా, మావోయిస్టుల భారత్ బంద్ పిలుపుతో కొన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి,శాంతి భద్రతల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

