విద్యార్థిని ఆరోపణల నేపథ్యంలో… చర్యలపై సందేహాలు
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఇటీవల నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో మండల విద్యాధికారి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టిన సమయంలో, సమావేశంలో జరిగిన ఈ వ్యాఖ్యలు ఉపాధ్యాయుల్లో కలకలం రేపాయి.సమావేశంలో MEO మాట్లాడుతూ, పెద్దపల్లి మండలంలోని ZPHS కనగర్తి పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడిపై, అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అసభ్య ప్రవర్తన ఆరోపణలు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థిని తాను ఇబ్బంది పడ్డానని స్పష్టంగా చెప్పినప్పటికీ, లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడానికి మాత్రం ముందుకురాలేదని MEO వివరించారు. కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లిఖిత ఫిర్యాదు ఇవ్వనని విద్యార్థిని తెలిపినట్లు తాము పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సంబంధిత ఉపాధ్యాయుడిని ఇతర విద్యార్థినుల భద్రత దృష్ట్యా, మౌఖిక ఆదేశాలతో మండలంలోని మరో ప్రాథమికోన్నత పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపినట్లు MEO తెలిపారు. అయితే, ఆ డిప్యుటేషన్ పాఠశాల ఉపాధ్యాయులు ఆయన్ని స్వీకరించేందుకు నిరాకరిస్తూ MEO దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇక ఈ వ్యవహారంపై విద్యా వర్గాల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. ఒక విద్యార్థిని స్వయంగా ఇబ్బంది పడ్డానని చెప్పిన సందర్భంలో, సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోకుండా, లిఖిత ఫిర్యాదు కోరడం, ఉపాధ్యాయుడిని MRC కార్యాలయంలో OD పేరుతో కొనసాగించేందుకు అనుమతించడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.
ఈ ఘటన వెనక ఎవరైనా ప్రభావశీలులు ఉన్నారా? ఉపాధ్యాయుడిని ఎవరు కాపాడుతున్నారు? అనే సందేహాలు కొంతమంది ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల భద్రత, పాఠశాల క్రమశిక్షణకు సంబంధించిన ఇలాంటి కేసుల్లో పారదర్శక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.ఈ ఘటనపై జిల్లా విద్యాధికారులు లేదా జిల్లా కలెక్టర్ స్పందిస్తారా అన్న ఆసక్తి నెలకొంది.

