300 యూనిట్లలోపు విద్యుత్తు చార్జీల పెంపు?.. గృహ వినియోగదారులపై అధిక భారం

whatsapp image 2025 11 24 at 8.09.00 am

రేపు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన?
నెలాఖరులో ఈఆర్సీకి నివేదిక సమర్పణ
‘స్థానికం’ అయిపోగానే పెంపు నిర్ణయం!
వచ్చే ఏప్రిల్‌ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి

కరెంటు చార్జీలు పెంచే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? సుదీర్ఘకాలంగా గృహ విద్యుత్తు వినియోగదారులపై పడని చార్జీల భారాన్ని ఇప్పుడు మోపేందుకు సమాయత్తమవుతున్నదా? తాజా పరిణామాలు అవుననే సంకేతమిస్తున్నాయి. 300 యూనిట్ల లోపు విద్యుత్తు టారిఫ్‌ను సవరించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్‌, నవంబర్‌ 23 : రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపేందుకు కాంగ్రెస్‌ సర్కారు సిద్ధమవుతున్నది. ముఖ్యంగా గృహ విద్యుత్తు వినియోగదారులపై 300 యూనిట్ల లోపు చార్జీలను పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. అంతకంటే అధిక విద్యుత్తు వినియోగదారులపైనా పెంపు వడ్డించనున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలను మంగళవారం క్యాబినెట్‌ సమావేశం ముందుంచనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 50 యూనిట్ల లోపు వినియోగించే వారికి యూనిట్‌కు రూ.1.95, 51-100 యూనిట్ల వరకు రూ.3.10, 101-200 యూనిట్ల వరకు రూ.4.80 చొప్పున చార్జీలు వసూలు చేస్తున్నది. ఇప్పుడు గృహ విద్యుత్తు వినియోగదారుల చార్జీల పెంచాలన్న ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. గృహజ్యోతి పథకంలో కొందరికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు అందిస్తున్నందున.. చార్జీలు పెంచితే రాయితీ కూడా పెరుగుతుందని కూడా ప్రభుత్వవర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది.

సర్కారు టార్గెట్‌.. ఇండ్ల కరెంట్‌

నిబంధనల ప్రకారం విద్యుత్తు పంపిణీ సంస్థలు నవంబర్‌ 30లోపు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను ఈఆర్సీకి సమర్పించాలి. ఏఆర్‌ఆర్‌లోనే చార్జీల పెంపును ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇలా అయితేనే చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతినిస్తుంది. రాష్ట్రంలో రెండు డిస్కంలు దాదాపు రూ.20 వేల కోట్ల లోటులో ఉన్నాయి. ఇన్నాళ్లు పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లపై ప్రభుత్వం భారం మోపింది. ఇంకా భారాన్ని భరించేందుకు ఆ వర్గాలు సిద్ధంగా లేవని, అందుకే ఇండ్ల కరెంట్‌ చార్జీలపై ఫోకస్‌ చేసిందని సమాచారం.

ఎన్నికలు ముగియగానే.. కరెంట్‌ షాక్‌

రాష్ట్రంలో ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన గత్యంతరంలేని పరిస్థితి ఏర్పడింది. సుదీర్ఘ కాలం దాటవేస్తూ వచ్చినా న్యాయస్థానం తీర్పులతో ఎన్నికలను ఎదుర్కోక తప్పని పరిణామాలు నెలకొన్నాయి. ఈ మేరకు డిసెంబర్‌లో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత స్థానిక సంస్థలు, పురపాలికల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరెంట్‌ చార్జీల పెంపు ప్రతిపాదనను దాచిపెడుతున్నది. చార్జీల పెంపు సంగతి ప్రజలకు తెలిస్తే.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుట్టి మునగడం ఖాయమని, ప్రభుత్వ పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికలు పూర్తవగానే ఏప్రిల్‌ ఒకటో విద్యుత్తు తారీఖున చార్జీల మోత మోగించాలని భావిస్తున్నట్టు సమాచారం.

పెంపుపై ఆగమేఘాలపై చర్యలు

ప్రభుత్వం విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలు, ఏఆర్‌ఆర్‌ నివేదిక రూపకల్పనను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. రెండు డిస్కమ్‌లకు సంబంధించిన ఏడాదిన్నర సమాచారాన్ని సమర్పించింది. దీంతో ప్రైవేటు సంస్థ ద్వారా ప్రభుత్వ పెద్దలు అత్యంత రహస్యంగా నివేదికను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. డిస్కమ్‌ అధికారులకు కూడా తెలియకుండా చాటుగా పని కానిస్తున్నట్టు సమాచారం. కేవలం ఒకరిద్దరు ఉన్నతాధికారులు నిమిత్తమాత్రంగా నివేదికలో భాగస్వాములు అవుతున్నట్టు తెలిసింది. సదరు ఏజెన్సీ నుంచి నేరుగా ప్రభుత్వానికి నివేదిక చేరనుంది. ప్రభుత్వం లాంఛనాలు పూర్తి చేసి, ఈఆర్సీకి సమర్పిస్తుందని తెలిసింది. ఈఆర్సీ ఆమోదంతో పెంపును త్వరగా అమల్లోకి తీసుకొచ్చేలా ప్రభుత్వంలోని ముఖ్యమైన నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *