Panchayat elections: సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు

whatsapp image 2025 11 22 at 8.49.32 am

కలెక్టర్లకు డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక
రిజర్వేషన్ల ఖరారుకు నేడు మార్గదర్శకాలు

హైదరాబాద్‌, నవంబరు 22: గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అంతా సిద్ధమవుతోంది.

డెడికేటెడ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతోంది. బీసీ రిజర్వేషన్లు 23శాతం చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్‌ కమిషన్‌ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా, దాన్ని మంత్రులకు పంపి ఆమోదముద్ర పడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత ఆ కమిషన్‌ నివేదికను అందులో బీసీల రిజర్వేషన్‌లను ఏ జిల్లాలో, ఏ మండలంలో ఎంతచొప్పున ఖరారు చేశారన్న అంశాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్లు దాన్ని పరిశీలించి మండలాలకు కూడా పంపించారు.

దాని ప్రకారం మండల స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం కసరత్తు పూర్తయింది. ఇందులో డెడికేటెడ్‌ కమిషన్‌ చెప్పినదానికి, మండలాల స్థాయిలో అదే ప్రకారం సర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్దారించుకున్నారు. దీంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అఽనధికారికంగా మండల స్థాయిలో పూర్తిచేసిన బీసీ రిజర్వేషన్ల చార్ట్‌ సిద్దంగా ఉండడంతో అధికారికంగా మార్గదర్శకాలు ఇచ్చిన వెంటనే మళ్లీ ఒకసారి వాటిని పరిశీలిస్తారు.

ఆదివారం నాటికి ఆ జాబితాలను అధికారికంగా ఖరారు చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి పంపిస్తారు. 24న(సోమవారం) హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేసు ఉంది. ఆ కేసు సందర్బంగా ప్రభుత్వం తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ, తాము చేసిన కసరత్తు వివరాలను కూడా సమర్పించనుంది. అనంతరం 25వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉంది.

26వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశాలున్నాయని సమాచారం. కాగా, ఇప్పుడు చేస్తున్న కసరత్తు అంతా బీసీల రిజర్వేషన్లకు సంబంధించే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన ఆధారంగా డెడికేటెడ్‌ కమిషన్‌ గతంలో 42శాతానికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. దాని ప్రకారమే ఈ సెప్టెంబరులో రిజర్వేషన్లను క్షేత్రస్థాయిలో ఖరారు చేశారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు కూడా 2011జనాభా లెక్కల ఽఆధారంగా సర్పంచ్‌, వార్డుల్లో రిజర్వేషన్లు ఖాయం చేశారు. అయితే బీసీ రిజర్వేషన్లు 42శాతం అనేది అమలు సాధ్యం కానందున ఇప్పుడు మళ్లీ పాత పద్దతిలో బీసీలకు 23శాతం చొప్పున సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. మొత్తం మీద రిజర్వేషన్లు 50శాతం మించకుండా మాత్రం చూసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *