పారదర్శకంగా విత్తనాల విక్రయం చేపట్టాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్
నకిలీ విత్తనాల విక్రయదారుల పై కఠిన చర్యలు చేపడతాం
విత్తన డీలర్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నడాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి:- జిల్లాలో పారదర్శకంగా విత్తనాల విక్రయం ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత విత్తన డీలర్లకు సూచించారు. వానకాలం విత్తన విక్రయ ప్రక్రియ, నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లాలోనే విత్తన డీలర్లకు మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
నకిలీ విత్తనాల విక్రయాల పై సీఎం కేసీఆర్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పిడియాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు జిల్లాలో ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వం అనుమతించిన కంపెనీ విత్తనాలను ప్యాకెట్ల లో మాత్రమే విక్రయించాలని, ఎలాంటి కల్తీకి పాల్పడటానికి అవకాశం ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ పాస్ యంత్రాల ద్వారా మాత్రమే రైతులకు ఎరువులు విత్తనాలను అమ్మాలని, క్షేత్రస్థాయిలో అంతర్జాలం సమస్యలను పరిష్కరించి తప్పనిసరిగా ఈ పాస్ యంత్రాలు వినియోగించాలని డీలర్లకు కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో విత్తనాల డీలర్ల ఈపాస్ యంత్రాల వినియోగంపై నివేదిక అందజేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో ఎరువులు విత్తనాల షాప్ ల పై జాయింట్ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తన షాపు విక్రయదారులు రిజిస్టర్ మెయింటెన్ చేయాలని , వారి లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. విత్తన షాపులో అందుబాటులో ఉన్న విత్తనాల స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డ్ పై నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఇంఛార్జి డిసిపీ అఖిల్ మహాజన్, జిల్లా వ్యవసాయ అధికారి ఆది రెడ్డి, ఏ. సి. పి. సారంగపాణి,సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.