గంజాయి సాగు చేస్తే పీడీ యాక్ట్. విక్రయించిన సరఫరా చేసిన కేసులే: పెద్దపల్లి ఏసిపి సారంగపాణి
గంజాయి సాగుచేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి హెచ్చరించారు. సోమవారం సుల్తానాబాద్ మండలంలోని సాంబశివ రైస్ మిల్లు లో గంజాయి మొక్క పెంచుతున్నారని సమాచారం మేరకు రైస్ మిల్ లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి మొక్కను పరిశీలించిన అనంతరం మిల్లు యజమానులను విచారించారు.
మిల్లు యజమాని ముత్యం రవీందర్ ఇతరులపైన కేస్ నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలో గంజాయి సాగు చేసినా సరఫరా చేసిన, విక్రయించినా కేసులు నమోదు చేయడంతోపాటు పిడి యాక్ట్ నమోదు చేస్తామన్నారు. గంజాయి పై ఉక్కు పాదం మోపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారన్నారు. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలో గతంలో గంజాయి సరఫరా విక్రయిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి తొమ్మిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 24 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.
గంజాయి సరఫరా దారులపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎవరైనా గంజాయి విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పూర్తిస్థాయి నిర్మూలనకు పోలీసు శాఖకు సహకరించాలన్నారు. ఏసీపీ వెంట సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై ఉపేందర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.