నన్ను ఆదరించి అసెంబ్లీకి పంపారు.. నిన్ను ఓడగొట్టారు: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి


పెద్దపల్లి:
నియోజకవర్గ ప్రజలకు తానేంటో తెలుసని.. అందుకే ప్రజలు తనను ఆదరించి రెండుసార్లు అసెంబ్లీకి పంపి.. నిన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చొబెట్టారని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావును ఉద్దేశించి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పెద్దపల్లి ప్రజలకు దాసరి మనోహర్ రెడ్డి అంటే ఏంటో తెలుసని.. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా రెండోసారి ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. 2009లో ఒక్కసారి ప్రజలు అవకాశమిస్తే నీ అరాచకాలను చూసి బెంబేలెత్తిపోయి 2014, 2018 ఎన్నికల్లో ఓడ గొట్టారన్నారు.


అవినీతికి విజయ రమణారావు కేరాఫ్ అడ్రస్ అనే విషయం ఆయనతో నిత్యం తిరిగే నాయకులతో పాటు పెద్దపల్లి ప్రజలందరికీ తెలుసన్నారు. ఇసుక టెండర్లు పూర్తి కాగానే రీచ్ ల సందర్శన అంటూ హడావిడి చేసి కొన్ని నెలలుగా మౌనంగా ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు. మానేరు పరివాహక ప్రజలందరికీ ఉచితంగా ఇసుక తీసుకువెళ్లే సదుపాయం ఉందన్నారు. ఈ విషయం తెలియక మాజీ ఎమ్మెల్యే ప్రజలకు ఇసుక దొరకడం లేదని, డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

ప్రజాభిమానం కోల్పోవడం వల్ల మూడవసారి ఓటమి కళ్ళ ముందు కనబడి మతిభ్రమించి తెరాస నాయకులపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నావని, ఎన్ని అబద్ధాలు ఆడినా ప్రజల విశ్వాసం పొందలేవన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరని, రెండుసార్లు ఓడగొట్టారని మూడోసారి కూడా ఓడకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని భవిష్యత్తులో ఎన్నడూ కూడా ఎమ్మెల్యే కాలేవన్నారు. ఈ సమావేశంలో తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.