ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాలకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన

సిద్ధిపేట మెడికల్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ కేంద్రీయ ఔషధ గిడ్డంగి, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాలకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ విమలా థామస్, డీఎంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని వైద్యశాఖ ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ప్రారంభంలో మంత్రి మాట్లాడుతూ..

తెలంగాణలో 12చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ సీఎంఎస్ ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో దాని కోసం రూ.3.86 కోట్ల చొప్పున రూ.43.20 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నామన్న ఆయన, వీటి ఏర్పాటుతో రోగులకు వెంటనే మందులు అందుతాయని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

“ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 720గా ఉన్న జాబితా 843 కు పెంచింది. ఇందులో ఈఎంఎల్ లో 311, ఏంఏంఎల్ జాబితాలో 532 మందులు ఉన్నాయి. దీనితో కొత్తగా 123 రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ ఆసుపత్రిలో 3 నెలలకు సరిపడేలా బఫర్ స్టాక్ ఉండేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించాం. డిశ్చార్జ్ అయ్యే పేషేంట్‌కు అవసరమైన అన్నీ మందులు ఇస్తూ ఇంటికి పంపిస్తున్నాం. రాష్ట్రంలో తొలిసారి రూ.20 కోట్లతో బయో మెడికల్ ఎక్విప్‌మెంట్‌ మెయింటనెన్స్ పేరిట వైద్య పరికరాల నిర్వహణకు పాలసీ రూపొందించాం.

వైద్య పరికరాలు ఎప్పటికప్పుడు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్-పీఏంయూ ను టీఎస్ ఎంఎస్ఐ డీసీలో ఏర్పాటు చేశాం. వైద్య పరికరాల వివరాలు అన్నీ కూడా వెబ్ పోర్టల్ లో నమోదై ఉంటాయి. ప్రస్తుతం ఏ ఆసుపత్రిలో ఉన్నాయో..? తయారీ తేదీ.? వారంటీ తేదీ.? గతంలో జరిగిన మరమ్మతుల వివరాలు, ప్రస్తుత మెయింటెనెన్స్ కాంటాక్ట్ వివరాలు ఇలా అన్నీ అందులో ఉంటాయి.

ఈ పోర్టల్ అడ్రస్ http://emma telangana.uat.dcservices.in/ కంట్రోల్ రూమ్ నెంబరు 8888526666 ఏర్పాటు చేశాం. సంబంధిత డాక్టర్ అయినా లేదా ప్రజలు కూడా లోపం ఉన్నదని సమాచారం అందగానే, పీఏంయూ తక్షణం స్పదిస్తుంది. సంబంధిత రిపేర్ కాంట్రాక్టు ఏజన్సీకి సమాచారం అందించి, వైద్య పరికరం నిర్ణీత సమయంలో పనిచేసే విధంగా చేస్తుంది. ఏజెన్సీ నిర్ణీత సమయంలో రిపేర్ చేయని పక్షంలో టెండర్ అగ్రిమెంట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆసుపత్రులలో పారిశుద్ధ్య ప్రమాణాలు పెంచడం కోసం, పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయించిన మేరకు ప్రభుత్వం బెడ్ ఒక్కింటికి చేసే పారిశుద్ధ్య ఖర్చును 5వేల నుంచి 7500 పెంచిందని, ఇందు కోసం రూ.338 కోట్లు ప్రతీ యేటా వెచ్చించినట్లు మంత్రి వెల్లడించారు.

డైట్ ఛార్జీలు రెట్టింపు చేసినట్లు, టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు బలవర్థకమైన ఆహారం అందించేలా.. ఒక్కో బెడ్ కు డైట్ ఛార్జీలు రూ.56 నుంచి రూ.112 పెంచినట్లు, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ చార్జీలు బెడ్ ఒక్కింటికీ రూ.40 నుంచి రూ.80 పెంచామని, ఇందు కోసం యేటా రూ.43.5 కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి వెల్లడించారు. హైదరాబాదులోని 18 మేజర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగితో ఉండే సహాయకులకు రూ.5కే మూడు పూటల భోజనం సదుపాయాలు కల్పించామని. ప్రతిరోజూ సుమారు 18, 600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని, ఇందు కోసం యేటా రూ.38.66 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. 20 సర్కారు ఆసుపత్రులలో మురుగు శుద్ధి ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు, రూ.134 కోట్లతో ఇలా అనేక కార్యక్రమాలు వైద్యాభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిపారు.

సిద్ధిపేటలో ఆయూష్ ఆసుపత్రి:

సిద్ధిపేటలో రూ.15కోట్లతో 50 పడకల ఆయూష్ ఆసుపత్రి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. ప్రజలు సంప్రదాయ వైద్యంపై ఆసక్తి చూపుతున్నారని, ప్రాముఖ్యత గుర్తించిన ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. ఆయూష్ ఆయుర్వేదం, యోగ, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియో దేని ప్రత్యేకత దానిదేనని చెప్పుకొచ్చారు. నాణ్యమైన సంప్రదాయ వైద్యం అందించే రాష్ట్రంగా తెలంగాణను నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిపేలా ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

నేచర్ క్యూర్ ఆసుపత్రి కోసం రూ.6కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు, సిద్ధిపేట తరహాలోనే వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లిలో 50 పడకలతో కూడిన ఆయూష్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 834 ఆయూష్ డిస్పెన్సరీలు, 5 కళాశాలలు, 4 రీసెర్చ్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో అన్నీ రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారని, ముఖ్యంగా ఆయుర్వేదంలో పంచకర్మ విధానం ద్వారా వెన్నుముక కీళ్ల సమస్యలు పక్షవాతం, దీర్ఘకాలిక రోగ సమస్యలకు చికిత్సలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

హోమియో వైద్యం ద్వారా చర్మ సమస్యలు, అలర్జీ సహా అనేక దీర్ఘకాలిక రోగ సమస్యలకు చికిత్స అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. యునాని వైద్యం ద్వారా రెజిమెంటల్ థెరపీ ద్వారా పక్షవాతం, ఇతర నరాల సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు, అలాగే యోగ, నాచురోపతి ద్వారా మానసిక సమస్యలు దూరం చేసి, మనస్సును శరీరాన్ని ఎలా నియంత్రణలో పెట్టాలో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. నార్మల్ డెలివరీలు పెంచేలా యోగ ఎంతో సహాయకరంగా ఉంటుందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, వేమన యోగ రీసెర్చ్ ఇన్సిట్యూట్ ద్వారా జిల్లాలో గర్భిణీలకు యోగ తరగతులు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. బీఆర్కేఆర్ ఆయుర్వేద కళాశాల, వరంగల్ ఆయుర్వేద కళాశాలల ద్వారా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. ప్రసూతి తంత్ర, స్త్రీ రోగ విభాగాల ద్వారా గర్భిణీలకు వైద్య సేవలు అందిస్తున్నామని, ఇదే విధంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేయబోతున్న 50 పడకల ఆయూష్ ఆసుపత్రిలో అన్నీ రకాల ఆయూష్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పారు.