ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దు పెట్టి వివాదంలో చిక్కుకున్న ఎంపీ..

బెంగాల్ లోని ఉత్తర మాల్దా లోక్ సభ నియోజక వర్గం నుంచి భాజపా ఎంపీ ఖగేన్ ముర్మూ పోటీ చేస్తున్నారు. సోమవారం తన నియోజకవర్గ పరిధిలోని శ్రిహిపుర్ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయన ఓ యువతి చెంపపై ముద్దు పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో, ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది..

దీనిపై అధికార తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. భాజపాను దుయ్య బట్టింది. “భాజపా ఎంపీ, ఉత్తర మాల్దా అభ్యర్థి ఖగేన్ ముర్ము ప్రచారం సందర్భంగా ఓ యువతికి ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు.. బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతలు.. ఇలా భాజపా క్యాంప్ మహిళా వ్యతిరేక నాయకులకు కొదవ లేదు.. నారీ మణులకు ‘మోదీ పరివార్’ ఇస్తున్న గౌరవం ఇది.. ఒకవేళ వారు అధికారం లోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి..!” అని టీఎంసీ విమర్శ గుప్పించింది. ఇది వివాదం కావడంతో ఎంపీ ఖగేన్ స్పందిస్తూ ఘటనపై స్పష్టత నిచ్చారు.

“ఆమెను నా కుమార్తెలా భావించా.. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి..? కుట్ర పూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి వ్యక్తులు, పార్టీల పరువుకు భంగం కలిగిస్తున్నారు. వారిపై (టీఎంసీ) ఫిర్యాదు చేస్తాం” అని భాజపా నేత వెల్లడించారు.

మరోవైపు, యువతి కూడా దీనిపై స్పందిస్తూ ఎంపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. “సొంత కుమార్తెలా భావించి ఆయన ముద్దు పెట్టుకుంటే అందులో సమస్య ఏంటి..? ఇలాంటి ఘటనలను సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిది చెత్త మనస్తత్వం.. ఆ ఫొటో తీసిన సమయంలో మా అమ్మా నాన్నా కూడా అక్కడే ఉన్నారు” అని ఆమె చెప్పారు