సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతిగా తెలంగాణా వ్యక్తి

తెలంగాణా రాష్ట్రానికి చెందిన డాక్టర్ పెన్నా మధుసూదన్ కు అరుదైన అవకాశం దక్కింది. ఆయన మహారాష్ట్ర రాంటెక్ లోని కవి కుల్గురు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులయ్యారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన డాక్టర్ పెన్నా మధుసూదన్ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత. ప్రస్తుతం ఆయన కాళిదాస్ యూనివర్సిటీలో డీన్ గా పనిచేస్తున్నారు.

ఇండియన్ ఫిలాసఫీ అండ్ కల్చర్ ఫ్యాకల్టీ గా కూడా ఉన్న ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు న్యాయ శాస్త్రం, సంస్కృతం, ఎంఏ ఆర్ట్స్, సంస్కృత యోగాల్లో 4 గోల్డ్ మెడల్స్ సాధించారు. 2018 ప్రపంచ సంస్కృత మహాసభలకు కోసం భారత బృందంలో సభ్యుడుగా డాక్టర్ మధుసూదన్ కెనెడా వెళ్లారు. వివిధ రంగాల్లో అనేక అవార్డులు, పురస్కారాలు అందుకొన్న డాక్టర్ పెన్నా మధుసూదన్ మహారాష్ట్ర విదర్భకు చెందిన అంధ సాధువు, మరాఠా, సంస్కృత భాషల్లో 135 కు పైగా పుస్తకాలు రాసిన గులాబ్ రావు మహరాజ్ జీవితచరిత్రపై రాసిన సంస్కృత మహాకావ్య పుస్తకానికి 2020 లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.