గిరిజనుల రిజర్వేషన్లను ఆమోద ముద్ర వేసే బాధ్యత ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదే: బోయినపల్లి వినోద్ కుమార్
రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేసే బాధ్యత ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్ఫష్టం చేశారు. ఒక బాధ్యతగల రాజ్యసభ సభ్యులుగా డాక్టర్ కె లక్ష్మణ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, వాస్తవాలకు అతీతంగా.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం లక్ష్మణ్ కు ఏ మాత్రం తగదు అని వినోద్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి కేంద్ర హోం శాఖ అడ్డంకులు సృష్టిస్తోందని, లేనిపోని సాకులు చూపిస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 6 నుంచి 10% రిజర్వేషన్లు పెంచుతూ 2017 లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి, బిల్లు ఆమోదంతో కేంద్ర హోం శాఖకు పంపి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ అంశానికి అతిగతి లేకుండా పోయిందని వినోద్ కుమార్ తెలిపారు.
రిజర్వేషన్లను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినా, అసెంబ్లీలో తీర్మానం, బిల్లు ఆమోదం చేసినా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు గత జులై నెలలో లేఖ రాశారని, ఎంపీగా తాను, సీతారాం నాయక్ పార్లమెంటులో ప్రస్తావించామని వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ రాసిన లేఖకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లేఖ రాస్తూ.. మైనార్టీల రిజర్వేషన్స్ సుప్రీంకోర్టులో తేలే వరకు గిరిజన రిజర్వేషన్లపై ఏ నిర్ణయం తీసుకోలేమని పేర్కొన్న విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
ఎలాంటి వివాదం లేని గిరిజన రిజర్వేషన్లకు ఎందుకు ఆమోదం తెలపడం లేదని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించారు. రాష్ట్రంలోని గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ ద్వారా సిఫార్సు చేసినా పట్టింపు లేకుండా పోయిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యులుగా బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించాలని, ఈ మేరకు చొరవ తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కు వినోద్ కుమార్ సూచించారు. వాస్తవాలను విస్మరించి రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని వినోద్ కుమార్ అన్నారు.