ధర్మశాలలో మూడ్రోజులపాటు జరిగిన పర్యాటక మంత్రుల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్ రెడ్డి
భారతదేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అన్ని భాగస్వామ్య పక్షాలు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందరూ కలిసి ఒకే గొడుగు కింద పనిచేసినప్పుడే సత్ఫలితాలను సాధించడం వీలవుతుందన్నారు. మూడ్రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న ‘పర్యాటక మంత్రుల జాతీయ సదస్సు’ ముగింపు సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు, మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ దేశీయ పర్యాటక రంగాభివృద్ధికి విలువలైన సూచనలు పంచుకున్నారని, ఇలాంటి సమావేశాలు తరచూ జరుగుతుండటం వల్ల వివిధ ప్రాంతాల్లో అమలుచేస్తున్న ఉత్తమ పద్దతులను చర్చించడంతోపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం వంటివాటిని మరింతగా పెంచుకునేందుకు వీలవుతుందని సూచించారు.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ దేశంలో పర్యాటకాన్ని వృద్ధి చేసేందుకు కృషి జరుగుతోందని ఇందులో భాగంగానే టూరిస్ట్ సర్క్యూట్ లకు రైళ్లు, రోడ్లు, విమాన మార్గాల అనుసంధానత వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులు, పర్యాటక శాఖ కార్యదర్శులు, పర్యాటకాభివృద్ధి సంస్థల అధ్యక్షులు మొదలైన వారు కూడా తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి సదస్సులు నిర్వహించాలని కిషన్ రెడ్డి సూచించారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులు మొదలుకుని రాష్ట్ర స్థాయి అధికారుల వరకు సమావేశమై చర్చించుకుని తమ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలన్నారు. వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచన చేశారు. అసరమైనే ఈ సమావేశాలకు కేంద్ర అధికారులు కూడా వస్తారన్నారు.
మీడియా విషయంలోనూ కిషన్ రెడ్డి స్పష్టమైన సూచనలు చేశారు. జాతీయ, ప్రాంతీయ పత్రికల్లో, పర్యాటక కేంద్రాల గురించి వ్యాసాలు, వార్తలు ప్రచురితమయ్యేలా చొరవతీసుకోవాలన్నారు. దీంతోపాటుగా సోషల్ మీడియాలోనూ ఆయా ప్రాంతాల ప్రాధాన్యతను, అందుబాటులో ఉన్న వసతులు, ఇతర ఏర్పాట్లు తదతర అంశాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుండాలని ఆయన సూచించారు. ఇతర ఖర్చులేమైనా తగ్గించుకునైనా సరే.. సోషల్ మీడియాలో సమాచారాన్ని అందించేందుకు పనిచేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్స్ ను ఏర్పాటుచేసుకోవాలన్నారు.
‘దేఖో అప్నా దేశ్’ లాగా ‘మా ప్రాంతాలను చూడండి’ అనే ఉద్యమాలను ప్రారంభించాలని సదస్సుకు వచ్చిన వారికి కేంద్ర మంత్రి సూచించారు. పర్యాటక కేంద్రాల వద్ద స్వచ్ఛత విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై రాష్ట్రాలు ప్రత్యేకమైన దృష్టి సారించాలని కిషన్ రెడ్డి సూచించారు. చిన్న చిన్న అంశాల కారణంగానే పర్యాటకులు ఇబ్బందులు పాలవుతున్నారని, టాయిలెట్లను స్వచ్ఛంగా ఉంచడం, ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఈ దిశగా ఇప్పటికే ఏఎస్ఐ కి ఆదేశాలు జారీచేశామని, ఆయా ప్రాంతాల్లోని వారు కూడా దీనిపై ఆలోచన చేయాలన్నారు. ముఖ్యమంత్రులు, రవాణా మంత్రులతో కలిసి రాష్ట్రాల్లో సమగ్ర పర్యాటక విధానం ఉండేలా చొరవతీసుకోవాలని పర్యాటక మంత్రులకు కిషన్ రెడ్డి సూచించారు.
‘యువ టూరిజం క్లబ్స్’ ఏర్పాటుపై ప్రత్యేకంగా మాట్లాడిన కిషన్ రెడ్డి. యువకులు, కాలేజీ విద్యార్థులను యువ టూరిజం క్లబ్స్ ద్వారా ప్రోత్సహిస్తూ.. వారి భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. దీంతోపాటుగా పర్యాటక కేంద్రాల వద్ద శాశ్వత పద్ధతిలో మన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసుకోవాలని, స్టార్ హోటళ్లు మొదలుకుని మోస్తరు హోటళ్ల వరకు ప్రతిచోటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని సూచించారు. త్రివర్ణ పతాకం ద్వారా ఆ పర్యాటక కేంద్ర ఇమేజ్ మరింతగా పెరుగుతుందన్నారు. 2023 వరకు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లోగోను కూడా పర్యాటక కేంద్రాలు, హోటళ్ల వద్ద ఏర్పాటుచేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇప్పటికే 150 ప్రాంతాల్లో ఏఎస్ఐ ద్వారా జాతీయ జెండాలను ఏర్పాటు చేశామన్న కేంద్ర మంత్రి, త్వరలోనూ 500 ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
త్వరలోనే సమగ్ర పర్యాటక వెబ్ సైట్ తీసుకురాబోతున్నామని, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రతి పర్యాటక కేంద్రానికి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలను సైతం ఇందులో పొందుపరుస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు రూపుదిద్దుకోనున్న ఈ వెబ్ సైట్ ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారం ఉండాలని అప్పుడే ఉత్తమమైన వెబ్ సైట్ సాధ్యమవుతుందన్నారు. త్వరలోనే ‘జాతీయ పర్యాటక విధానం’ (నేషనల్ టూరిజం పాలసీ)ని తీసుకురాబోతున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీని ద్వారా దేశ పర్యాటక రంగాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికితోడుగా పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ‘ఇండియన్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్’ను నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా కేంద్రమంత్రి తెలిపారు.
పర్యాటక కేంద్రాలకు అవసరమైన రైళ్లను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామన్న కిషన్ రెడ్డి, వీటి నిర్వహణ బాధ్యత మాత్రం రాష్ట్రాలదే అన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ పర్యాటకంలో భారతదేశం కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించిన కిషన్ రెడ్డి, ప్రసాద్, స్వదేశ్ దర్శన్ విషయంలో పరస్పర సహకారం అవసరమని సూచించారు.