ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించడంపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారు: శోభా కరంద్లాజే
డిసెంబర్ తర్వాత కూడా పేదలకు ఉచిత రేషన్ అందించడానికి పిఎంజికెఎవై పథకాన్ని పొడిగించే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో నిర్ణయం తీసుకుంటారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన ఆహార ధాన్యాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని శోభా కరంద్లాజే తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం గత 28 నెలల్లో 1.80 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. ఆహార భద్రతా చట్టం మరియు ఇతర సంక్షేమ పథకాల కింద ఆహార ధాన్యాలు అందించడానికి అవసరమైన ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్), పిఎంజికెఎవై లాంటి సంక్షేమ పథకాల అమలు కోసం ధాన్యం సేకరణ సజావుగా జరుగుతున్నదని మంత్రి తెలిపారు. “అపోహలు ఉన్నప్పటికీ” సజావుగా జరుగుతున్నాయి. కరువు మరియు వాతావరణ మార్పు ప్రభావం కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ లో వరి మరియు గోధుమ ఉత్పత్తి తగ్గింది అని చెప్పడం కేవలం అపోహ మాత్రమే అని శ్రీమతి శోభా కరంద్లాజే స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పిడిఎస్ వ్యవస్థను ఆధునీకరించడానికి చర్యలు అమలు చేస్తున్నామని కరంద్లాజే తెలిపారు. దీనిలో భాగంగా ఆహార ధాన్యాల వృథా తగ్గించడానికి,పిడిఎస్ ఆహార ధాన్యాలు స్వాహా కాకుండా చూడడానికి పటిష్ట చర్యలు అమలు జరుగుతున్నాయని అన్నారు.సేకరించిన ధాన్యానికి డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్) ద్వారా నేరుగా రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ శ్రీమతి శోభా కరంద్లాజే చిరు ధాన్యాల దిగుబడి పెంచే అంశానికి ప్రభుత్వం దృష్టి సారించింది అని తెలిపారు. 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటిస్తున్న సందర్భంగా దేశంలో చిరు ధాన్యాల ఉత్పత్తి, ఎగుమతులు ఎక్కువ చేయడానికి చర్యలు అమలు చేయాలని నిర్ణయించామని మంత్రి వివరించారు.