తెలంగాణ బీజేపీ ఆత్మ న్యూనతలో ఉందా..?ఆత్మహత్య వైపు వెళ్తుందా..!?

చాణక్యుడిని చంపి పుట్టిన చంద్రబాబుని మింగేసిన కేసిఆర్ పై తలపడటం అంటే మాటలా !! అయినా ఈ రెండు దశాబ్దాలలో కేసీఆర్ ఊడుగు గింజలా పైనుండి క్రిందకు కింద నుండి పైకి ఎన్నిసార్లు ఎగరలేదు..

ఎన్నిసార్లు దుంకలేదు…కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి సమరయోధుడు, కాళోజి లాంటి కరుడుగట్టిన తెలంగాణ వాది, జయశంకర్ లాంటి నిప్పులకొలిమి, గద్దర్ లాంటి అర్బన్ నక్సలైట్, కోందండరాం లాంటి ఎర్రకోయిల అందరూ కేసిఆర్ ని భుజాల మీద ఎక్కించుకొని దింపినవారే… తర్వాత జండూ బామ్ రాసుకొన్నవారే…

అంతటి కేసిఆర్ పై కాలుదువ్వడానికి మహా మహా మేధావులు రంకెలేసి వంగిపోయారు….అలాంటి గండర గండడి పై బండి సంజయ్ అనే పిల్ల మల్ల యోధుడు తలపడుతుంటే….పక్కాగా పక్కన నిలబడి సీటీ కొట్టాల్సింది పోయి… బండి సంజయ్ ని బజార్లోకి లాగే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ??

తాతలకాలం నాటి మురిగిపోయిన నాయకులు కొందరు అసమ్మతి గళం అని ఏదో తలమాసిన మీటింగ్ పెడితే తగుదునమ్మా అని వెళ్లి ఇంకొంచెం పోపు వేసి వస్తున్నది ఎవరు !!తెలంగాణాని తెగనమ్మేస్తున్నాడని, కమ్మేస్తున్నాడని కేసిఆర్ పై ఆరోపణలు చేస్తున్న వారు… తలా ఓ శక్తిగా మారి తలపడాల్సింది పోయి… బండి సంజయ్ పై బండరాళ్లు వేయడం వెనుక ఎవరున్నారు అని…. ఇప్పుడు తెల్లవారక ముందే తెలంగాణ కోడై కూస్తున్నది…..

ఏ దరిద్ర తపస్వి పెట్టిన శాపమో తెలీదు గాని తెలుగు రాష్ట్రాల భాజాపాకు ఎప్పుడు అరిష్టాలే….ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ కేటీఆర్ కి మీసం రాకముందే తీర్మానం చేసిన పార్టీ, తెలంగాణ పై మీకు హక్కు లేదని కేటీఆర్ తిడుతుంటే నిజమేనేమో అని బిక్క ముఖం వేస్తున్నది…. విచిత్రం….

ఆలే నరేంద్రతో కలిసి సంఘ్ పెద్దలను కేసిఆర్ కలిసి RSS నుండి RSU వరకు అందర్నీ తెలంగాణ కోసం కలుస్తాం, బొంత పురుగునైనా ముద్దాడుతాం అని ఆరోజు అన్నవారు, తిరగేసి బీజేపోడు తెలంగాణాలో మతతత్వం పుట్టిస్తున్నాడు… అంటుంటే కొంపదీసి నిజమేనా ! అని బయపడుతున్న వైనం ……

కార్ స్టీరింగ్ నా చేతిలో ఉంది అని ఓవైసీ స్వయంగా చెప్పినా …మరొకడు ఒవైసీ మీ దోస్త్ అంటుంటే నిజమే కావచ్చని బలహీనంగా మాట్లాడటం బీజేపీ నేతల ధైన్యం …..

ఇదంతా పక్కకు జరిపి కర్ణాటక ఎన్నికల్లో బాజాపా ఓడిపోయిందని… తెలంగాణ లో గుడ్లు తెలేసిందని పచ్చ మీడియా పచ్చి విషాన్ని పిచ్చ పిచ్చగ విరజిమ్ముతూ ఉంటే… చచ్చిన పేనులా కాషాయ నేతల మనస్తత్వం..అసలు కర్నాటక లో రాహుల్ గెలిపించాడా.? ఓహో… అయితే..మరి ఆ మధ్య గుజరాత్ లో.. పంజాబ్ లో.. యూపీలో… నార్త్ ఈస్ట్ లో… రాహుల్ ప్రతిభాసామర్త్యాలు… ఏమయ్యాయని ఒక్కరూ అడగడం లేదు….

విచిత్రం…37 ఎన్నికల్లో శూన్యహస్తం చేసి, పార్టీని పాతాళంలోకి నెట్టిన రాహుల్ అనన్య నాయక ధీరత్వాన్ని గురించి ఎవరు మాట్లాడటం లేదు…

అబ్బో…!?అంతెందుకు..! భారత్ జోడో యాత్ర తెలంగాణ లోకి ప్రవేశించిన వెనువెంటనే మునుగొడులో మూలకుపడ్డ కాంగ్రెసుకు అప్పుడు వేరే నాయకుడు ఉన్నాడా ? అని ఎవరూ అడగరు….

విదేశాల్లోకి వెళ్లి ఏదో రెండు పిచ్చి ముచ్చట్లు మాట్లాడించే కోటరీ దర్శకత్వంలో వచ్చిన డైలాగులకు….తెలంగాణ మీడియా, కాంగ్రెస్, బిఆర్ఎస్ తలపై మోస్తుంటే బీజేపీ ఎందుకు తల్లడిల్లి పోతుంది !!

అసలు కాంగ్రెస్ వారే జోడో యాత్రలో మావోడికే చాయ్ హోటల్ లో బజ్జీలలో మిరపకాయ ఎలా ఇరికిస్తారో… ఇన్నాళ్లకు తెలియపరిచగలిగాం… అంటుంటే ఇప్పటికిప్పుడు రాహుల్ వెంటనే అపరమేధావి అయినట్లు రాష్ట్ర ఎన్నికలనే కింద మీద చెయ్యగల సమర్థుడు అయినట్లు… తెలుగు మీడియా ఎందుకు ఉప్పొంగిపోతుంది అన్నదే ఎవడికీ అర్థం కాని భేతాళ ప్రశ్న….

బీజేపీ అధికారం లోకి రావడం ఇక్కడి సోకాల్డ్ మేధావులకి, మీడియాకి, మీడియేటర్లకి, కమ్మ్యునిష్టులకి, పెట్టుబడిదారులకు, కులావాదులకి, కుట్రదారులకి అస్సలు ఇష్టం లేదు.

ఇక బిజెపి ని నిలువరించడానికి, బండి సంజయ్ పై బండ వేసేందుకు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉండనే ఉన్నారు…శిఖండి రాజకీయాలకు చంద్రబాబు కూడా ఇంకా బతికే ఉన్నాడు….

ఇదంతా అర్దం చేసుకోకుండా బీజేపీ వారు కూడా ఎండ్రి కాయల కాంగ్రెస్ సిద్దాంతం ఎందుకు ఫాలో అవుతున్నారు. ?

కొత్తగా వచ్చిన వారు కలిసికట్టుగా పనిచెయ్యాల్సింది పోయి పార్టీకి శల్య సారధ్యం ఎందుకు….అని తెలంగాణ ప్రజల ప్రశ్న… ఈ కుట్రలను అర్థం చేసుకోకుండా… ఉచ్చులోపడి ఉన్నో న్ని చంపుకొని ఇంకేం చేస్తారు….

కేంద్ర నాయకత్వం కూడా నేషన్ ఫస్ట్ అంటూ తెలుగు రాష్ట్రాలను వదిలిపెట్టకుండా యుద్ధంలో నిలబడాలి… రణమో.. శరణమో…! తేలిపోతుంది…ఇప్పుడు సాధించింది ఏమీ లేదు… అప్పుడు పోయేది ఏమి లేదు ……….

సమయం లేదు మిత్రమా.. రణమా !! శరణమా !! ఆలోచించుకోండిపిట్ట పోరు పిట్ట పోరు పిల్లి దీర్చినట్లు మీరు రొట్టె కోసం కొట్లాడుతుంటే… అందుకుపోయేందుకు కోతి ఎల్లప్పుడూ సిద్ధం….

తస్మాత్ జాగ్రత్త ……

కాలభైరవుడు