ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. దళారులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరిక
రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్.ఎఫ్.సి.ఎల్) లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన వారు వెంటనే బాధితులకు సొమ్ము తిరిగి చెల్లించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ లో ఉద్యోగాల పేరిట కొందరు పైరవికారులు, దళారులు పలువురు నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో బాధితులకు అణా పైసలతో సహా తిరిగి చెల్లించాలని గతంలోనే ఆదేశించడం జరిగిందని, ఇప్పటివరకు ఎవరైనా తిరిగి చెల్లించని ఎడల వెంటనే బాధితులకు చెల్లించాలని ఆదేశించారు.
ఒకవేళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు నిరుద్యోగుల నుండి ఆర్.ఎఫ్.సి.ఎల్ లో ఉద్యోగ నియామకాల పేరిట డబ్బుల వసూలుకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని, వారిపై చట్టపరమైన చర్యలకు పోలీసుశాఖకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు.