బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు సంబరమే సంబరం ముందుగాల
ముందుగాల మెత్తటి మట్టిదెచ్చి
పీటమీద బొడ్డమ్మను జేసి
ఆడపిల్లలందరు పదిరోజులాడి
బొడ్డెమ్మను దీసి అనుమాండ్ల గద్దెమీద పెట్టిపోయిరా
బొడ్డెమ్మ పోయి రావమ్మాఅని పాడే టోళ్ళు!
పెత్రమాసనాడు ఇంటింట పడతులు
కట్లపూలు, రుద్రాక్ష పూలు నందివర్దనాలు,
అడివి చామంతులు
గున్కపూలతోటి బతుకమ్మలను పేర్చి
ఎంగిలీ పూలేసి బిడ్డలూ,కోడళ్ళు
ఇంటింటి రాణులు ఇంపుగా పాడుతూ నడుములను వాల్చి, మెడలను వాల్చి నయగారలతో ముద్ద బంతుల్లాంటి ముదితలందరు చేరి
అవ్వగారింటియీ, అత్తగారింటియీ
ఆడబిడ్డల అలక, మొగలప్రేమల మునక
ముసి ముసి నవ్వుల మురిపాల ముచ్చట్ట్లు
కొంటె కృష్ణుని క్రియల కోలాట
క్రీడల వంపుల సొంపుల వయ్యారి భంగిమల బతుకమ్మల చుట్టూ పంక్తిలా తిరగుతూ
పరవశించీ పోయీ పసుపును గందాల సిగ్గులొలికే గుంట చెంపలంతా పూసి,
పుస్తెలకు పూదించి సత్తు ప్రసాదాల వాయినాల పంచె నవరాత్రులంతసంబరాల సంపదే
ఇంటి నిండ వెలుగే బతుకమ్మ పండుగే!
మంచాల వెంకటేశ్వర్లు
కరీంనగర్