ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు వేళ.. భోగి నుంచి కనుమ వరకు ఆధ్యాత్మిక వైభవం
హనుమకొండ/వర్ధన్నపేట, :
ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు వేళ సమీపించింది. ఒగ్గుడోలు చప్పుళ్ల మధ్య మంగళవారం నుంచి స్వామివారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదారు లక్షల మంది భక్తులు తరలిరానుండటంతో ఐనవోలు ప్రాంగణం ఆధ్యాత్మిక వైభవంతో ఉట్టిపడనుంది.
ఒగ్గు పూజారుల జానపద పదాలు, శివసత్తుల పూనకాలు, గజ్జెల లాగుల నృత్యాలతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో మారుమోగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని అధికారులు విద్యుత్ కాంతులతో సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు.
మూడు రోజుల్లో ఐదు లక్షల మంది భక్తులు
మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు భోగి నుంచి కనుమ వరకు వైభవంగా నిర్వహించనుండగా, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు ప్రతి బుధ, ఆదివారాల్లో వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.
సంక్రాంతి మూడు రోజుల్లోనే దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నట్లు దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి మేడారం జాతర కూడా ఉండటంతో వనదేవతలకు మొక్కులు చెల్లించి వచ్చే భక్తుల కారణంగా ఐనవోలులో రద్దీ మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
ఇబ్బందులు తప్పేనా?
జాతరకు సంబంధించి పలు పెండింగ్ పనులు భక్తులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. టెంపరరీ టాయిలెట్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి వినియోగానికి అనుకూలంగా లేవని, సత్రాల మార్గంలోని మరుగుదొడ్ల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. స్నాన ఘట్టాల వద్ద పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా రోడ్ల మరమ్మతులు చేయాలని ప్రజాప్రతినిధులు ఆదేశించినా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇల్లంద నుంచి ఐనవోలుకు వచ్చే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల భక్తులు కూడా ఇదే మార్గం గుండా రావాల్సి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
పోలీసుల వ్యవహారంపై భక్తుల అసంతృప్తి
ఆలయ ప్రాంగణంలో కొందరు పోలీసుల అత్యుత్సాహం భక్తులకు అవస్థలు కలిగిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఆలయం లోపల భక్తుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
అలాగే ప్రతి జాతర సమయంలో ఎదురయ్యే అధిక ధరల సమస్య ఈసారి కూడా భక్తులను ఇబ్బంది పెడుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఆలయ పరిసరాల్లో రెగ్యులర్, టెంపరరీ కలిపి సుమారు 120 దుకాణాలు ఉండగా, కొబ్బరికాయలు, తాగునీరు సహా ఇతర వస్తువులకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జాతర పనులు పూర్తి: అధికారులు
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని గత నెల దేవాదాయశాఖ మంత్రి సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులను ఆదేశించారు.
దీంతో ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్‌తో పాటు 14 మంది కమిటీ సభ్యులు, ఈవో సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ఆవరణలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
పారిశుధ్య నిర్వహణ కోసం జీడబ్ల్యూఎంసీతో పాటు చుట్టుపక్కల గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 300 మంది కార్మికులను విధుల్లోకి దింపారు. గత జాతరలో విధులు నిర్వహించిన అధికారులకు మళ్లీ బాధ్యతలు అప్పగించారు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా దాదాపు 200 సీసీ కెమెరాలు, 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సుమారు 50 బస్సుల వరకు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
