క్యాతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్.. ప్రజా సమస్యలపై నేరుగా స్పందన
మంచిర్యాల జిల్లా:
క్యాతనపల్లి మున్సిపాలిటీలో కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 17, 19 వార్డుల్లో పర్యటించిన మంత్రి, స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
రోడ్లు, డ్రైనేజీ కాలువలు, విద్యుత్ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి అంశాలను పరిష్కరించాలని కాలనీవాసులు మంత్రిని కోరారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్‌తో ఇళ్లకు నష్టం
ఆర్కే ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ కారణంగా ఇళ్లు దెబ్బతింటున్నాయని, దుమ్ము ధూళి వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు మంత్రికి వివరించారు. ముఖ్యంగా 4వ వార్డు ప్రజలు తమ ప్రాంతాన్ని ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి, పునరావాసం మరియు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి, ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని 4వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.
జీవో 76 అమలు, సింగరేణి భూముల్లో పట్టాలపై హామీ
నిలిపివేసిన జీవో నెం.76ను అమలు చేసి ఇళ్ల క్రమబద్ధీకరణ చేపట్టాలని ప్రజలు కోరగా, ఈ విషయమై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించి, సింగరేణి భూముల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేలా కృషి చేస్తానని మంత్రి తెలిపారు.
బెల్ట్ షాపులపై కఠిన చర్యలు
కాలనీల్లో బెల్ట్ షాపుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన మంత్రి, అక్రమ బెల్ట్ షాపులను అరికట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
మార్నింగ్ వాక్ అనంతరం 3వ మరియు 18వ వార్డుల్లో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు.
