బస్తీల్లోనే ‘అంతర్జాతీయ’ విద్య
ఓఆర్ఆర్ లోపల 23 కొత్త ప్రభుత్వ స్కూళ్లకు సర్కారు ప్లాన్
హైదరాబాద్ :
పేద, మధ్య తరగతి విద్యార్థులకు బస్తీల్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల జనసాంద్రత ఎక్కువగా ఉండి, ప్రభుత్వ పాఠశాలలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా 23 ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించే విధంగా ఈ స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ బృహత్తర ప్రణాళిక అమలులో భూసేకరణ ప్రధాన సవాల్‌గా మారింది.
ప్రతి స్కూల్‌కు కనీసం ఒక ఎకరం లేదా అంతకంటే ఎక్కువ స్థలం ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించింది. కానీ, కొన్ని ప్రాంతాల్లో అధికారులు ప్రతిపాదించిన స్థలాలు అర ఎకరం కంటే తక్కువగా ఉండటంతో, ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో పాటు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు నగర శివారులోని సంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యా మౌలిక సదుపాయాల విస్తరణ అత్యవసరంగా మారిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
