సిద్దిపేటలో తొలి ఆయిల్ పామ్ రిఫైనరీ ప్రారంభం.. ఉగాది కానుకగా రైతులకు భారీ లాభాలు – మంత్రి తుమ్మల
హైదరాబాద్: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జి. వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు “పరాభవ నామ సంవత్సర” ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణలో తొలిసారిగా ఆయిల్ పామ్ రిఫైనరీని సిద్దిపేట నియోజకవర్గం నర్మేట గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించి, ఈ నెల 22న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రిఫైనరీ లేకపోవడంతో రైతులు అశ్వారావుపేటకు తమ ఉత్పత్తిని తరలించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ కొత్త ఫ్యాక్టరీతో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ రిఫైనరీ ప్రారంభంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.300 కోట్లు కేటాయించి, కేవలం 16 నెలల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషమన్నారు.
ఉగాది సందర్భంగా రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందిస్తోంది. ఈ నెల 22న నర్మేట సభా వేదిక నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఒకేసారి ఇంత భారీ స్థాయిలో నిధులు జమ చేసే ప్రభుత్వం ఇదేనని మంత్రి స్పష్టం చేశారు.
అలాగే, ఇప్పటికే 20 లక్షల మంది రైతులకు రూ.20,000 కోట్ల రుణమాఫీ చేసినట్లు గుర్తుచేశారు. గతంలో 9 రోజుల్లో రూ.9,000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, ఈసారి కూడా అదే స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేయనుందని తెలిపారు.
రైతుల అభివృద్ధి కోసం ఆధునిక సాంకేతికతను పరిచయం చేస్తూ, మార్చి 21, 22, 23 తేదీల్లో రైతాంగ సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సదస్సుల్లో కొత్త వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యంత్రాలు శాస్త్రవేత్తల ద్వారా రైతులకు వివరించబడతాయని తెలిపారు.
ఇదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు మద్దతు ధర అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
