ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఇంధన సంక్షోభం.. యుద్ధాలు, దాడులతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు
ప్రస్తుత ప్రపంచం మునుపెన్నడూ చూడని అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, మరోవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం, అమెరికాలో జరిగిన ప్రమాదాలు—అన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా ప్రకారం, మార్చి నెలలో రోజుకు దాదాపు 8 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ లోటు ఏర్పడింది.
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ మార్గాన్ని సరఫరా చేయడం గ్లోబల్ సరఫరా వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
ఇక ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ కాంప్లెక్స్ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై డ్రోన్ దాడులు జరగడంతో ఎగుమతి సామర్థ్యం పడిపోయింది. సౌదీ అరేబియాలోని యన్‌బు రిఫైనరీ, కువైట్‌లోని మీనా అల్-అహ్మదీ వంటి కీలక కేంద్రాలు కూడా దాడులకు గురై క్రూడ్ ఆయిల్ ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తూర్పు యూరప్‌లో ఉక్రెయిన్ తన వ్యూహాన్ని మార్చి రష్యా ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకుంది. సరతోవ్, ఉఫా రిఫైనరీలు, ప్రిమోర్స్క్ ఆయిల్ టెర్మినల్‌పై జరిగిన డ్రోన్ దాడులతో భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. దీని వల్ల రష్యా నుంచి భారత్ వంటి దేశాలకు వచ్చే చౌక చమురు సరఫరాకు పెద్ద అడ్డంకి ఏర్పడింది.
ఇక యునైటెడ్ స్టేట్స్‌లోని టెక్సాస్‌లో ఉన్న వాలెరో రిఫైనరీలో జరిగిన పేలుడు కూడా పరిస్థితిని మరింత విషమం చేసింది. రోజుకు లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ మూతపడటంతో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గిపోయింది.
ఈ విధంగా ప్రపంచంలోని ప్రధాన ఇంధన ఉత్పత్తి కేంద్రాల్లో యుద్ధాలు, దాడులు, ప్రమాదాలు కలిసి సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దిగుమతులపై ఆధారపడే భారతదేశం వంటి దేశాలకు ఇది పెద్ద సవాలుగా మారింది. యుద్ధం ప్రారంభమై నెల కూడా గడవకముందే కొన్ని ప్రాంతాల్లో “నో స్టాక్” పరిస్థితులు కనిపించడం లేదు, ఈ సంక్షోభం ఎంత లోతుగా ఉందో చూపిస్తోంది.
