జర్మనీలో నైపుణ్య శిక్షణ విధానాలపై మంత్రి వివేక్ అధ్యయనం – తెలంగాణ యువతకు అంతర్జాతీయ దిశానిర్దేశం
G. వివేక్ వెంకటస్వామి జర్మనీ పర్యటనలో భాగంగా నైపుణ్యాభివృద్ధి రంగంలో ఉన్న ఉత్తమ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. బుధవారం హన్నోవర్ నగరంలో ఆయన ఛాంబర్ ఆఫ్ స్కిల్డ్ క్రాఫ్ట్స్ (HWK) అధికారులతో సమావేశమయ్యారు.
జర్మనీలో వృత్తి విద్య, నైపుణ్యం ఆధారిత కళల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న HWK దేశవ్యాప్తంగా 53 ప్రాంతీయ ఛాంబర్లతో పనిచేస్తూ క్రాఫ్ట్ రంగానికి బలమైన మద్దతు అందిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి, అక్కడ అమలవుతున్న శిక్షణ విధానాలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ మోడల్స్, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కోర్సులు, మానవ వనరుల అభివృద్ధిపై లోతుగా చర్చించారు.
ఈ సందర్భంగా HWK క్యాంపస్ సీఈఓ వోల్కర్ ష్మోల్జ్ తో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక సహకారం, తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలను కల్పించే యువత మార్గాలపై చర్చించారు.
మంత్రి తదుపరి బృందం శిక్షణా కేంద్రాలను సందర్శించి పాఠ్య ప్రణాళికను పరిశీలించారు. ట్రైనర్లు, పరిపాలన సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడి కెరీర్ మార్గదర్శక కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి చర్యలు, వృత్తి విద్యలో ఆధునిక సాంకేతికతపై సమగ్ర అవగాహన పొందారు.
ఈ పర్యటన ద్వారా తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా కొత్త శిక్షణ మోడల్స్‌ను రాష్ట్రంలో అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.
