రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణ వేగవంతం చేయాలి – ఎలక్ట్రిక్ వాహనాల్లో భారత్ ముందుండాలి: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, ఏప్రిల్ 22:
భారతదేశంలో రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణను వేగవంతం చేసి, వాటి సమర్థ వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కార్మిక, ఉపాధి మరియు గనుల మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు భారత్‌ను ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లిస్తున్నాయని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) ఆధ్వర్యంలో నిర్వహించిన “రేర్ ఎర్త్ ఖనిజాలు – ఎలక్ట్రిక్ వాహనాలు” జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, హోర్ముజ్ సముద్ర మార్గం మూసివేత వంటి పరిణామాలు భారత్‌పై ఇంధన పరమైన ఒత్తిడిని పెంచుతున్నాయని ఆయన వివరించారు.
భారత్ తన చమురు అవసరాల్లో సుమారు 50 శాతం, ఎల్‌పీజీ అవసరాల్లో 80 శాతం వరకు హోర్ముజ్ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల వరకు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంధన దిగుమతుల వ్యయం 100 బిలియన్ డాలర్ల నుంచి 160 బిలియన్ డాలర్లకు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) భవిష్యత్ ఇంధన అవసరాలకు కీలక పరిష్కారంగా నిలుస్తాయని మంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికత అభివృద్ధికి రేర్ ఎర్త్ ఖనిజాలు అత్యంత అవసరమని, ఈ రంగంలో భారత్ ఇంకా వెనుకబడి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ అన్వేషణలో భారత్ వాటా కేవలం 1 శాతమే ఉండగా, చైనా ఈ రంగంలో ముందంజలో ఉందని తెలిపారు. దేశం 6–7 శాతం ఆర్థిక వృద్ధిని కొనసాగించాలంటే రేర్ ఎర్త్ రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
యువ ఇంజినీర్లు ఈ రంగంలో ముందుకు వచ్చి ఆవిష్కరణలకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యమని పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధి దిశగా రాష్ట్రంలో 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) మారుస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా 25,000 మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని, వారికి నెలకు రూ. 2000 స్టైపెండ్ కూడా ఇస్తున్నామని చెప్పారు. ESCI మార్గదర్శకత్వంలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టి యువతను ఆధునిక సాంకేతిక రంగాలకు సిద్ధం చేయాలని సూచించారు.
రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణలో పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం టామ్ కామ్ ద్వారా విదేశాల్లో కూడా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని తెలిపారు.
