ప్రతి చిన్నారి పాఠశాలలో ఉండాలి.. పనిలో కాదు: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజమంతా భాగస్వామ్యం కావాలి
హైదరాబాద్, జూన్ 15:”ప్రతి చిన్నారి పాఠశాలలో ఉండాలి.. పనిలో కాదు” అనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను సామాజిక ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే చిన్నారుల భవిష్యత్తు మారుతుందని, అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ATCs ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం-2026 సందర్భంగా బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అనేక మంది చిన్నారులు పనుల్లోకి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి, అలాంటి పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్చడం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చని తెలిపారు. చిన్నారుల బాల్యాన్ని కాపాడటం, వారికి నాణ్యమైన విద్యను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పినట్లుగా విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని గుర్తు చేసిన మంత్రి, గతంలో బాల కార్మికులుగా ఉన్న పలువురు ప్రస్తుతం మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం విద్య శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో అవగాహన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించగలమని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs), నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విదేశీ ఉద్యోగాలకు అనుగుణంగా భాషా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని మంత్రి వివరించారు. చిన్నారులు విద్యను పూర్తిచేసుకుని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందగలరని అన్నారు.
బాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను మంత్రి అభినందించారు. బాల కార్మికులను రక్షించి విద్యాబాట పట్టించేందుకు వారు చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు.
బాల కార్మిక వ్యవస్థ లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, మంచి భవిష్యత్తు కల్పించేందుకు అందరూ భాగస్వాములు కావాలని మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.
