ప్రతి ఒక్కరూ రాజ్యాంగ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలి
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
హనుమకొండ, ఆగస్టు 11, 2026: రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు.
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC), వరంగల్ ఫీల్డ్ కార్యాలయం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’పై నిర్వహిస్తున్న రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రాం (ICOP), ఫొటో ఎగ్జిబిషన్‌ను మంగళవారం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ప్రారంభించారు.
ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తరుణ్ కుమార్ బోడా, CBC రూపొందించిన జాతీయ పతాకం ప్రస్థానం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతిబింబించే అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటంతో పాటు దేశ అభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు, పౌరులుగా తమ కర్తవ్యాలను ఇలాంటి కార్యక్రమాలు గుర్తు చేస్తాయని అన్నారు. హక్కుల కోసం పోరాడటం ఒక నాణేనికి ఒక వైపు మాత్రమేనని, మరోవైపు పౌరులుగా మన బాధ్యత ఏమిటో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.
మనకు లభించిన స్వాతంత్ర్యానికి గౌరవం, విలువ ఇస్తూ భవిష్యత్ తరాలకు ఎలాంటి సమాజాన్ని అందించాలనేది ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉందన్నారు. దేశ అభివృద్ధి, భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని తెలిపారు. యువత తమ జీవితాలను ఎలా మలుచుకోవాలనేది పూర్తిగా వారి చేతుల్లోనే ఉందని, కష్టపడి తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. క్విజ్, వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్ర్యం కోసం జరిగిన త్యాగాలు, పోరాటాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్వతంత్ర భారతదేశంలో జన్మించడం, గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను వారసత్వంగా పొందడం మన అదృష్టమని అన్నారు. రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులను కూడా కల్పించిందని తెలిపారు.
ఆగస్టు 15, జనవరి 26 వంటి జాతీయ పర్వదినాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు, స్వాతంత్ర్యం వెనుక దాగి ఉన్న కృషి, త్యాగం, పోరాటాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం మనం చూస్తున్న జాతీయ పతాకం ఒక్కరోజులో రూపుదిద్దుకున్నది కాదని, దాని వెనుక ఎన్నో సంవత్సరాల కృషి, పోరాటాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. మనకు లభించిన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ్యవస్థను కృతజ్ఞతతో గుర్తుంచుకోవడంతో పాటు, దానిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు మరింత బలమైన ప్రజాస్వామ్యాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల్లో దేశం పట్ల బాధ్యత, జాతీయ భావన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు.
కార్యక్రమంలో కళాబృందాలు ప్రదర్శించిన ‘హర్ ఘర్ తిరంగా’ యక్షగానం విద్యార్థులను ఆకట్టుకుంది. క్విజ్, వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రజనీ లత, ప్రోగ్రాం ఇన్‌చార్జ్ సమత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
