ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్:
తేదీ : 19.03.2026
బడ్జెట్ 2026-27 రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని రూపొందించబడుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధిక వడ్డీ విధానంతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని విమర్శించారు. సుమారు ఎనిమిది లక్షల కోట్ల అప్పులను రాష్ట్రంపై మోపిన పరిస్థితుల్లో కూడా, ప్రజల ఆమోదంతో కూడిన బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోందన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను “రెవల్యూషనరీ బడ్జెట్” గా అభివర్ణిస్తూ, ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని మంత్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత రెండు సంవత్సరాల్లోనే అప్పులపై సుమారు మూడు లక్షల కోట్ల వరకు వడ్డీలు చెల్లించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ, ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతులకు రుణమాఫీ మరియు రైతు భరోసా వంటి కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే రేషన్ కార్డుల జారీ ద్వారా అర్హులైన వారికి మద్దతు అందిస్తున్నామని తెలిపారు.
ప్రజాపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ రూపొందించబడుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
