స్వరాజ్- భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కీ సమగ్ర గాథ
మెగా సీరియల్ ని తెలుగులో ప్రసారం చేయనున్న ‘డీడీ యాదగిరి’ చానెల్
హైదరాబాద్: 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ‘స్వాతంత్ర్య అమృత మహోత్సవం’లో భాగంగా సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ మేరకు స్వరాజ్య సముపార్జన దిశగా దేశం సాగించిన పయనాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తూ ‘స్వరాజ్ – భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కీ సమగ్ర గాథ’ అనే మెగా సీరియల్‌ని దూరదర్శన్ నిర్మించింది. ఈ సీరియల్ ని తెలుగులో ఆగస్టు 20 నుంచి దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం తమ ఛానెల్ ‘దూరదర్శన్ యాదగిరి’లో ప్రసారం చేస్తుంది. దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎన్.వి.రమణ, డిప్యూటీ డైరెక్టర్ సురేఖ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు వారు గురువారం కవాడిగూడలోని ‘సీజీఓ’ టవర్స్ లో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్ర్య సముపార్జన కోసం మన పెద్దలు చేసిన త్యాగాలను కృతజ్ఞతతో స్మరించుకోవడమే ఈ సీరియల్ ప్రధానోద్దేశమని సురేఖ ఈ సందర్భంగా చెప్పారు. మొత్తం 75 భాగాలుగా రూపొందించిన ఈ మెగా సీరియల్ ప్రాంతీయ భాష లో ఆగస్టు 20 నుంచి ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుందని తెలిపారు. అలాగే ఆదివారం రాత్రి 09:30 నుంచి 10:30 గంటలదాకా; బుధ, శుక్రవారాల్లో ఉదయం 11:00-12:00 గంటల మధ్య పునఃప్రసారం అవుతుందని వివరించారు.
స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న యోధులతోపాటు నాటి పోరాటంలో భాగస్వాములైన అజ్ఞాత వీరుల త్యాగాలను ఈ సీరియల్ ప్రముఖంగా ప్రస్తావిస్తుందని పేర్కొన్నారు. ఈ సీరియల్ ఆంగ్లంలోనే కాకుండా తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ తదితర ఎనిమిది ప్రాంతీయ భాషలలోకి తర్జుమా చేయబడింది. ఇది ఆగస్టు 20 నుంచి ఆల్ ఇండియా రేడియోలో ప్రతి శనివారం ఉదయం 11:00 గంటలకు ప్రసారం చేయబడుతుంది. కాగా, గౌరవనీయులైన ప్రధానమంత్రి నిన్న న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ ఆడిటోరియంలో కేంద్ర మంత్రిమండలి సభ్యులు, దూరదర్శన్-ఐఐఎస్ అధికారులతో కలసి ఈ సీరియల్ తొలి భాగాన్ని తిలకించారు. అంతకుముందు ఆగస్టు మొదటి వారంలో దేశీయాంగ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ సీరియల్‌ను ప్రారంభించగా, సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘స్వరాజ్- భారత్ కే స్వతంత్రత సంగ్రామ్ కీ సమగ్ర గాథ’ భారతదేశంలో వాస్కో-డగామా అడుగుపెట్టిన 15వ శతాబ్దం నుంచి భారత స్వాతంత్ర్య పోరాట అద్భుత చరిత్రను వివరించే 75 భాగాల మెగా సీరియల్. స్వాతంత్ర్య పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన అజ్ఞాత వీరుల జీవితాలు, త్యాగాలకు సంబంధించిన భారతీయ చరిత్రలోని అనేక అంశాలను ఈ సీరియల్ ప్రదర్శిస్తుంది. డాక్యుమెంట్-డ్రామా రూపంలో సమర్పిస్తున్న ఈ సీరియల్ నిర్మాణం కోసం ప్రముఖ చరిత్రకారుల బృందం లోతుగా శోధించింది.
ప్రముఖ సినీ నటుడు మనోజ్ జోషి ఈ సీరియల్ వ్యాఖ్యాతగా (సూత్రధారి) అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. ఇది అత్యున్నత నాణ్యతతో నిర్మితమైన సీరియల్ మాత్రమేగాక కనువిందు చేసేదిగానూ ఉంటుందని ఈ బృందం హామీ ఇచ్చింది. ఈ సీరియల్లో పొందుపరచిన ఛాయాచిత్రాలు, చలనచిత్రాలు, మౌఖిక చరిత్రలు, వ్యక్తిగత జ్ఞాపకాలు, ఆత్మకథలు, జీవిత చరిత్రలు, బహుభాషా ప్రాంతీయ సాహిత్యంపై చర్చ వంటివి దీనికిముందు పెద్దగా శోధించబడిన దాఖలాలు లేవు. ఫలితంగా వీటిలో అనేక అంశాల గురించి ప్రజలకు తెలియకుండా పోయింది. అటువంటి అంశాలు, చిహ్నాలు, ఈవెంట్లు, సంస్థల గురించి దృశ్య-శ్రవణ రూపంలో ‘స్వరాజ్యం కోసం శోధన’ పేరిట సమగ్ర చట్రం కింద సమీకృతం చేసి అత్యుత్తమ నాణ్యతతో కూడిన 75 భాగాల సీరియల్ రూపంలో ప్రజల వద్దకు తీసుకురాబడింది. భారతదేశంలో ‘స్వరాజ్యం’పై శోధన, నిర్ధారణను బుల్లితెరపై చారిత్రక వివరణతో ప్రదర్శించేలా ఈ కథనం రూపొందించబడింది.
జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులు భారతదేశ స్ఫూర్తిని సరికొత్త, వినూత్న దృక్పథంతో అర్థం చేసుకునే విధంగా ఇది తోడ్పడుతుంది. అదే సమయంలో స్మరించదగిన త్యాగాలు చేసినా అనేకమందికి దక్కని గుర్తింపును తెచ్చిపెడుతుంది. ‘స్వరాజ్’ దూరదర్శన్‌కు ఒక ఐతిహాసిక సీరియల్ కాగలదని భావించబడుతోంది.
ఇది భారతదేశ ఘనమైన చరిత్రను ప్రజలకు… ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చి, ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగేలా చేయడం ద్వారా ఒక జాతీయ ఉద్యమ రూపం దాల్చగలదు! దూరదర్శన్ తన ప్రాంతీయ ఛానెళ్లను పునరుద్ధరణకు యోచిస్తోంది. ఈ మేరకు వర్తమాన అంశాలపై అర్థవంతమైన చర్చలతో కొత్త కార్యక్రమాలు, వార్తా చిత్రాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో విలేకరులకు దూరదర్శన్ అధికారులు మరిన్ని వివరాలు వెల్లడిస్తూ త్వరలో మరో నాలుగు సీరియళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ‘జై భారతి’, ‘కార్పొరేట్ సర్పంచ్’, ‘యే దిల్ మాంగే మోర్’ ఉన్నాయి. దేశభక్తి, మహిళా సాధికారతలపై సందేశాత్మకంగా ఉండే ఈ సీరియళ్లు దూరదర్శన్ జాతీయ చానెల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రధాన వేళల్లో ప్రసారమవుతాయి. ఈ మేరకు 2022 ఆగస్టు 15 నుంచి ఇవి ప్రారంభమయ్యాయి. వీటితోపాటు బప్పీలహరికి నివాళిగా మరో సీరియల్ ‘సురోం కా ఏకలవ్య’ రియాలిటీ మ్యూజిక్ షోగా అధిక వినోదాన్ని పంచుతుంది. ఇది 2022 ఆగస్టు 14న ప్రారంభం కాగా, ప్రధాన వేళలో రాత్రి 8 నుంచి 9 గంటలదాకా శని, ఆదివారాల్లో ప్రసారం చేయబడుతుంది. ఇక అంకుర సంస్థలపై దృష్టి సారించే కార్యక్రమం ‘డీడీ న్యూస్, డీడీ నేషనల్’ చానెల్లోనూ ప్రసారం కాబోతోంది. ఇందులో భాగంగా ‘స్టార్టప్ ఛాంపియన్స్ 2.0’ కింద జాతీయ అవార్డులు సాధించిన 46 అంకుర సంస్థల ప్రయాణం, విజయాలను ప్రేక్షకుల ముందుకు తెస్తుంది. ఇది శనివారం రాత్రి 9 గంటలకు డీడీ న్యూస్‌లో, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు డీడీ నేషనల్లో ప్రసారమవుతుంది.
ఈ విలేకరుల సమావేశంలో పీఐబీ-సీబీసీ డైరెక్టర్ శ్రీమతి శృతి పాటిల్, దూరదర్శన్ కేంద్రం ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీమతి కె.కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.