శిరివెళ్లమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆళ్లగడ్డ, నంద్యాల నేరవార్తలు | శిరివెళ్ల | న్యూస్‌టుడే:
అర్ధరాత్రి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని దగ్ధమైన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడుగా వెళ్తున్న ఓ డీసీఎం డ్రైవర్ తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగులగొట్టడంతో పలువురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
కిటికీల ద్వారా బయటకు దూకడంతో పదిమందికిపైగా ప్రయాణికులు స్వల్ప గాయాలపాలయ్యారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రయాణికుల లగేజీ మొత్తం బూడిదైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
