తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.1% డీఏ పెంపు ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగులకు 2.1 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపును ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఉన్న 50.7 శాతం డీఏ 52.8 శాతానికి పెరిగింది.
ఈ పెరిగిన డీఏను 2026 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే గత మూడు నెలలకు సంబంధించిన బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ పెంపుతో ఆర్టీసీ సంస్థపై ప్రతి నెలా రూ. 2.82 కోట్ల అదనపు భారం పడనుంది.
గతంలో 2025 జూలైలో కూడా ప్రభుత్వం 2.1 శాతం డీఏ పెంపును అమలు చేసిన విషయం తెలిసిందే. మే 2024లో RPS-2017 అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలేవీ పెండింగ్‌లో లేవని మంత్రి స్పష్టం చేశారు.
డీఏ పెంపు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు రీజియన్ల ఆర్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి, సంస్థలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా పాలనలో భాగంగా ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్, కారుణ్య నియామకాలు, కొత్త రిక్రూట్‌మెంట్ల ద్వారా పని భారం తగ్గించడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అలాగే, దీర్ఘకాలంగా విధులకు దూరమైన సిబ్బందిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం, కొత్త బస్సుల కొనుగోలుతో సంస్థను ఆధునీకరించడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలంగాణకు లైఫ్‌లైన్‌గా నిలిచిన ఆర్టీసీ సేవలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.
