జైపూర్లో హృదయ విదారకం: ఒకే రోజు పెళ్లి… గంటల ముందే అక్కాచెల్లెల ఆత్మహత్య
జైపూర్: ఇద్దరు కూతుర్ల పెళ్లిని ఒకే రోజు, ఒకే మండపంలో, ఒకే ముహూర్తానికి జరిపించాలని కలగన్న తల్లిదండ్రులకు ఊహించని విషాదం ఎదురైంది. పెళ్లికి కొన్ని గంటల ముందు అక్కాచెల్లెలు ఇద్దరూ విషం తాగి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం, జోధ్‌పూర్ సమీపంలోని మనై గ్రామానికి చెందిన శోభ (25), విమల (23) అనే అక్కాచెల్లెల పెళ్లిని ఫిబ్రవరి 21, 2026న నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులు, బ్యాండ్ మేళాలతో ఇల్లు పెళ్లి సందడితో కళకళలాడుతోంది. తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే అర్ధరాత్రి సమయంలో అక్కాచెల్లెలు ఇద్దరూ ఇంట్లో అపస్మారక స్థితిలో పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జోధ్‌పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇద్దరి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన మేనమామ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఇద్దరూ విషం తాగి చనిపోయినట్లు తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ వ్యవహారం కారణంగా, ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతోనే ఈ ఆత్మహత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన వేళలోనే ఇద్దరు యువతులు ఇలా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో మనై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
