డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో వాహనాల సీజ్‌పై హైకోర్టు స్పష్టత – పోలీసులకు గైడ్‌లైన్స్ జారీ
హైదరాబాద్:
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో వాహనాలను స్వాధీనం చేసుకునే అధికారంపై హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, కేవలం ఆ కారణంతోనే వాహనాన్ని సీజ్ చేయడానికి పోలీసులకు అధికారం లేదని తేల్చి చెప్పింది.
2025లో సాయిరాం రావు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాన్ని సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జె. విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ జరిపారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, గత తీర్పుల ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది మాత్రం సాయిరాం రావుపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాహనానికి సంబంధించిన చలాన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయని వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం సరైనది కాదని పేర్కొన్నారు. సరైన పత్రాలు చూపించినట్లయితే వాహనాన్ని విడుదల చేయాలని స్పష్టం చేశారు.
అలాగే, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను హైకోర్టు జారీ చేసింది. ఈ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించిన అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.
హైకోర్టు గైడ్‌లైన్స్ ఇవే:
- మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వాహనం నడిపితే, అతడిని డ్రైవ్ చేయనివ్వకూడదు.
- అతనితో పాటు మద్యం తాగని, సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉంటే వాహనాన్ని అతనికి అప్పగించాలి.
- అలాంటి వ్యక్తి లేకపోతే, బంధువులు లేదా స్నేహితులకు సమాచారం ఇవ్వాలి.
- ఎవరూ రాకపోతే వాహనాన్ని తాత్కాలికంగా పోలీస్ స్టేషన్‌లో భద్రపరచాలి.
- వాహనాన్ని సీజ్ చేయడం కాకుండా, పత్రాలు చూపించిన తర్వాత యజమానికి అప్పగించాలి.
- ప్రాసిక్యూషన్ అవసరమైతే, మూడు రోజుల్లోపు మెజిస్ట్రేట్ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయాలి.
- మెజిస్ట్రేట్‌లు కూడా మూడు రోజుల్లో సమర్పించిన చార్జ్‌షీట్లను స్వీకరించాలి.
- మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి.
ఈ తీర్పు ద్వారా డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో పోలీసుల విధులపై స్పష్టత ఏర్పడింది. అదే సమయంలో పౌరుల హక్కులను కాపాడే దిశగా హైకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
