‘అతిథి దేవోభవ’ మన అస్తిత్వం: కిషన్ రెడ్డి
భారతదేశ అస్తిత్వంలో ‘అతిథి దేవోభవ’ అంటూ మన పెద్దలు ఆవలంబించిన విధానం కీలకమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే 25 ఏళ్లలో ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ప్రపంచంలో అత్యుత్తమ ఆతిథ్య దేశంగా భారతదేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐహెచ్ఎమ్ వంటి సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు భారతదేశం సాధించనున్న ఈ పురోగతిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
బుధవారం ఐహెచ్ఎం-పూసా వజ్రోత్సవ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనానంతర పరిస్థితుల్లో భారత పర్యాటక, ఆతిథ్య రంగం మళ్లీ ప్రగతి బాట పట్టిందని, ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశం విదేశీ పర్యాటకు ఆకర్శించే విషయంలో ముందు వరసలో ఉందన్నారు.
ఒక సంస్థ 60 ఏళ్లు పూర్తిచేసుకోవడం గొప్ప విషయమన్న ఆయన, ఈ సంస్థలో హోటల్ మేనేజ్మెంట్ శిక్షణ పొందిన వారు దేశ, విదేశాల్లో ఆతిథ్య రంగంలో రాణిస్తుండటం మనందరికీ గర్వకారణమన్నారు. సేవారంగం దూసుకుపోతున్న తరుణంలో.. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య శిక్షణను అందిస్తూ రేపటి భారత ఆతిథ్య రంగం అంబాసిడర్లుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందుకోసం కొత్త సాంకేతికతను, అంతర్జాతీయంగా ఉత్తమ పద్ధతులను అలవర్చుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. వివిధ రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న సమయంలో ఐహెచ్ఎం వంటి భారతీయ విద్యాసంస్థలు ఇందులో చోదకశక్తిగా మారాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి అర్వింద్ సింగ్, జ్ఞాన్ భూషణ్, వీరేందర్ సింగ్ దత్తా, పద్మశ్రీ సంజీవ్ కపూర్, ఈ కళాశాలలో విద్యనభ్యసించిన ప్రముఖ హోటళ్ల షెఫ్స్, యాజమాన్యాల్లో పనిచేస్తున్న ప్రముఖులు, పాఠశాలలో విద్యాబోధన చేసి పదవీవిరమణ పొందిన అధ్యాపకులు, బోధనాసిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.