విషాదం.. చలికి గడ్డకట్టి.. అమెరికా సరిహద్దుల్లో భారత కుటుంబం దుర్మరణం మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా..
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ భారతీయ కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాంతమైంది. అమెరికా – కెనడా సరిహద్దుల్లో తీవ్రమైన మంచు తుపాను కారణంగా చలికి గడ్డకట్టుకుని ఆ కుటుంబమంతా దుర్మరణం చెందింది. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం విచారకరం. జనవరి 19న ఈ ఘటన చోటుచేసుకోగా.. మృతులను తాజాగా గుర్తించారు. వీరు గుజరాత్‌కు చెందిన జగదీశ్ బల్‌దేవ్‌భాయ్ పటేల్ (39), ఆయన భార్య వైశాలిబెన్ (37), కుమార్తె విహంగి జగదీశ్ కుమార్ పటేల్ (11), కుమారుడు ధార్మిక్ జగదీశ్ కుమార్ పటేల్ (3) అని కెనడియన్ అధికారులు వెల్లడించారు. కెనడా నుంచి అమెరికాకు నిత్యం పెద్ద ఎత్తున అక్రమ వలసలు జరుగుతుంటాయి. వీటిని అరికట్టేందుకు అమెరికా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల అగ్రరాజ్యానికి ఇద్దరు భారత వ్యక్తులను అక్రమంగా తీసుకొచ్చిన కేసులో స్టీవ్ శాండ్ అనే పౌరుడిని అమెరికన్ అధికారులు అరెస్టు చేశారు.
జనవరి 19న ఇరు దేశాల సరిహద్దుకు సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజున సరిహద్దుకు కొంత దూరంలో కెనడా వైపు నాలుగు మృతదేహాలను కనుగొన్నట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు.. యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారులకు సమాచారమిచ్చారు. సరిహద్దుకు 12 మీటర్ల దూరంలో మంచులో కూరుకుపోయి అత్యంత దారుణమైన స్థితిలో ఈ మృతదేహాలు కన్పించాయి. దీంతో అధికారులు వెంటనే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. విపరీతమైన మంచు కారణంగా గడ్డకట్టుకుపోయి వీరంతా చనిపోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆ తర్వాత దర్యాప్తు చేపట్టగా.. చనిపోయినవారు భారత్‌కు చెందిన పటేల్ కుటుంబంగా గుర్తించారు. సరిహద్దుకు చేరుకునే ముందు కొద్ది రోజులు వీరంతా కెనడాలోని పలు ప్రాంతాల్లో సంచరించినట్లు దర్యాప్తులో తేలింది. పటేల్ కుటుంబం జనవరి 12న టొరంటో చేరుకుందని, అక్కడి నుంచి జనవరి 18న సరిహద్దుకు బయల్దేరిందని కెనడా పోలీసులు ధ్రువీకరించారు. దీని వెనుక మానవ అక్రమ రవాణా ముఠా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. ‘‘సరిహద్దు వద్ద ఎలాంటి వాహనం కన్పించలేదు. అంటే వీరిని ఎవరో ఒకరు వాహనంలో ఇక్కడ దించేసి వెళ్లి ఉంటారు. ఇదంతా మానవ అక్రమ రవాణా ముఠా పనే అని భావిస్తున్నాం’’ అని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మృతుల ఫొటోను కూడా ట్విటర్‌లో పంచుకున్నారు. పటేల్ కుటుంబం మృతిని కెనడాలోని భారత హైకమిషన్ కూడా ధ్రువీకరించింది. మృతులు బంధువులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.