🛕 శ్రీరామనవమి సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి పూజల్లో పాల్గొన్నారు
మంచిర్యాల జిల్లా | తేదీ: 27.03.2026
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి జిల్లాలో పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాములు ఈ విశ్వానికి ఆదర్శ దంపతులని పేర్కొన్నారు.
శ్రీరాముడు చూపిన ధర్మమార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమని, కుటుంబ సభ్యులను ప్రేమతో కాపాడుకోవడం, కష్టసమయాల్లో ధైర్యంగా నిలబడడం వంటి విలువలను ఆయన జీవితం ద్వారా మనకు నేర్పించారని మంత్రి తెలిపారు. శ్రీరామరాజ్యాన్ని స్థాపించి ఆదర్శ పాలనకు నిదర్శనంగా నిలిచిన మహానుభావుడు శ్రీరామచంద్రుడు అని కొనియాడారు.
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి, శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
శ్రీరామనవమి సందర్భంగా మంత్రి మంచిర్యాల జిల్లా మరియు చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లోని 7వ వార్డు, కొత్త తిమ్మాపూర్, పాత తిమ్మాపూర్ అమ్మ గార్డెన్, కేతనపల్లి మనబడి మున్సిపాలిటీ పరిధిలోని పలు హనుమాన్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తన సతీమణి సరోజాతో కలిసి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
