మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్: తెలంగాణలో వైన్ షాపులకు తాళం, 11–13 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఫిబ్రవరి 11న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడింది. అదే సమయంలో అన్ని మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని వైన్ షాపులు, బార్లు, పబ్‌లు పూర్తిగా క్లోజ్ చేశారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఫిబ్రవరి 11 పోలింగ్ రోజు వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. అంతేకాదు, ఫిబ్రవరి 13న జరిగే కౌంటింగ్ రోజున కూడా వైన్ షాపులు మూతపడి ఉంటాయి.
ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియడంతో మైకులు బంద్ అయ్యాయి. పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించనున్నారు.
పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 25 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ద్వారా పటిష్ట నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
