హైదరాబాద్లో పెట్రోల్ పరేషాన్.. బంకుల వద్ద భారీ క్యూలు – కొరతా? రూమరా?
హైదరాబాద్: నగరంలో ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్ చర్చలే వినిపిస్తున్నాయి. రోడ్డెక్కిన ప్రతి వాహనదారుడి గమ్యం ఇప్పుడు పెట్రోల్ బంకులే. నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద వందల సంఖ్యలో కార్లు, బైకులు క్యూలలో నిలబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తం హైదరాబాద్ సిటీ పెట్రోల్ పరేషాన్లో మునిగిపోయినట్టుగా పరిస్థితి మారింది.
పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందంటూ.. మరో రెండు రోజుల్లో అస్సలు దొరకదంటూ.. బంకులు మూసేస్తారంటూ సోషల్ మీడియాలో, మౌఖికంగా విస్తృతంగా ప్రచారం జరగడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కొన్ని పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూసివేయడం, మరికొన్ని బంకుల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపించడం వాహనదారుల్లో భయాందోళనలను మరింత పెంచింది.
దీంతో సాధారణంగా 100, 200 రూపాయలకే ఇంధనం తీసుకునే వారు కూడా ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. ఎప్పుడూ తక్కువ మొత్తంలోనే పెట్రోల్ కొట్టించుకునే వాహనదారులు సైతం 500 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువగా ఇంధనం నింపించుకుంటున్నారు. కార్లు, ఆటోలు, కమర్షియల్ వాహనాలు కూడా ఫుల్ ట్యాంక్ వైపు మొగ్గు చూపుతున్నాయి. కొందరు అప్పులు చేసి మరీ ఇంధనం నిల్వ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ అనూహ్య పరిస్థితుల వల్ల హైదరాబాద్లో రోజువారీ పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఒక్కసారిగా మూడింతలు పెరిగింది. భారీ డిమాండ్ కారణంగా కొన్ని బంకుల్లో స్టాక్ త్వరగా అయిపోవడంతో “నో స్టాక్” బోర్డులు పెట్టాల్సి వస్తోంది. ఇది చూసిన వాహనదారులు నిజంగా కొరత ఉందని భావించి మరింతగా బంకుల వైపు పరుగులు తీస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వం, ఇంధన సంస్థలు కొరత లేదని స్పష్టం చేస్తున్నా.. మరోవైపు బంకుల వద్ద కనిపిస్తున్న పరిస్థితులు వాహనదారుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. “నో స్టాక్” బోర్డులు ఎందుకు పెడుతున్నారు? బంకులు ఎందుకు మూసేస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రజల్లో గందరగోళానికి దారి తీస్తున్నాయి.
అయితే నిపుణుల మాటలో ఇది అసలు సరఫరా సమస్య కాదని.. ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ వల్ల తలెత్తిన తాత్కాలిక పరిస్థితి మాత్రమేనని చెబుతున్నారు. రూమర్లను నమ్మకుండా, అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని అధికార వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
