యూరియా ఉత్పత్తిలో RFCL నూతన మైలురాయి

”మేక్ ఇన్ ఇండియా” చొరవతో భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ RFCL. దేశంలో వ్యవసాయోత్పత్తిని పెంచడం, రైతులకు సరసమైన ధరలకు సకాలంలో తగినంత యూరియాను అందించడానికి RFCL దోహదపడుతున్నది. ఇది పౌరులందరికీ ఆహార భద్రత కల్పించే దిశగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది.

2022-2023 ఆర్థిక సంవత్సరంలో… నేటి వరకు RFCL నుంచి రైల్వేల ద్వారా 250 రేక్‌ల యూరియాను పంపింది. ఈ సందర్భంగా RFCL CGM సుధీర్ కుమార్ ఝా, పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కాంతారావు, RFCL అధికారులు మరియు కార్మికులు, తెలంగాణ వ్యవసాయ శాఖ సిబ్బంది, 250వ యూరియా రవాణా గూడ్స్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో RFCL తెలంగాణ మరియు పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 8.06 లక్షల మెట్రిక్ టన్నుల వేప పూతతో కూడిన యూరియాను పంపింది. ఇందులో తెలంగాణకు 51.40%, ఆంధ్రప్రదేశ్‌- 17.67%, కర్ణాటక- 22.07%, మహారాష్ట్ర- 4.34 %, ఛత్తీస్‌గఢ్‌- 2.17%, తమిళనాడుకు 2.35 % యూరియాను సరఫరా చేసింది.

ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా, తెలంగాణా రాష్ట్ర పరిపాలన శాఖ, కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వే, ఇతర వాటాదారులకు RFCL తరపున.. చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ కుమార్ ఝా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.