శ్రీశైలం డ్యామ్ సురక్షితం – ప్లంజ్ పూల్‌పై డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లారిటీ
శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ గేట్ల ముందు భాగంలో ఏర్పడిన ప్లంజ్ పూల్ (గొయ్యి) కారణంగా ఎలాంటి ప్రమాదం లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. ఇటీవల డ్యామ్ పరిస్థితులపై వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో బుధ, గురువారాల్లో నిపుణుల బృందం ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించి సమగ్ర పరిశీలన చేపట్టింది.
డ్యామ్ నిర్మాణ స్థితి, గేట్ల పనితీరు, ప్లంజ్ పూల్ లోతు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం… ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని తేల్చింది. బృంద సభ్యుడు డీకే శర్మ మాట్లాడుతూ ప్లంజ్ పూల్ ఉన్నా డ్యామ్‌కు ఎటువంటి హానీ లేదని, అవసరమైతే మరమ్మతులు చేపట్టే అవకాశముందని తెలిపారు. డ్యామ్ పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని, త్వరలో పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు.
ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వివరాల ప్రకారం… 2018లో ప్లంజ్ పూల్ లోతు 47 మీటర్లుగా నమోదైందని, 2025లో కేంద్ర జల సంఘం నిర్వహించిన సర్వేలో కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నట్లు గుర్తించారని తెలిపారు. గత ఏడు సంవత్సరాల్లో లోతు పెరగకపోవడం వల్ల ప్రస్తుతం పెద్దగా ఆందోళన అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది.
అయితే ముందుజాగ్రత్త చర్యలుగా గేట్ల వద్ద, పక్క గోడల వద్ద మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్లంజ్ పూల్ మరింత లోతుగా మారకుండా నిరోధించేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం సిలిండర్లకు స్టీల్ ప్రొటెక్షన్ పనులు కొనసాగుతుండగా, భవిష్యత్తులో కాంక్రీట్ వాల్ నిర్మాణం అవసరమా అనే అంశంపై కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
డ్యామ్ మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.203.05 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో అప్రోచ్ రోడ్డుకు రూ.25 కోట్లు, సైడ్ గ్రిట్టింగ్ పనులకు రూ.5 కోట్లు కేటాయించి ఇప్పటికే పనులు ప్రారంభించారు.
మొత్తంగా చూస్తే… శ్రీశైలం డ్యామ్ ప్రస్తుతం సురక్షితంగానే ఉందని నిపుణులు స్పష్టం చేసినప్పటికీ, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేస్తున్నారు.
