తాళం చెవి దాచిన చోటే దొరికింది… 14 తులాల బంగారం దోచిన దొంగ అరెస్ట్
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లమ్మబండలో దొంగతనం ఘటన వెలుగుచూసింది. ఇంటి తాళం చెవిని బయట దాచిన విషయాన్ని గమనించిన వ్యక్తి అదును చూసుకుని ఇంట్లోకి చొరబడి సుమారు 14 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు.
జగద్గిరిగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీకి చెందిన రేకపల్లి లక్ష్మి (63) ఈ నెల 23న సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి తాళం వేసి, తాళం చెవిని తలుపు పక్కనే ఉన్న డ్రమ్ కింద దాచారు. అదే కాలనీకి చెందిన పత్రో శంకర్ (36) ఆమె తాళం దాచిన విధానాన్ని గమనించాడు.
ఆమె వెళ్లిన వెంటనే డ్రమ్ కింద ఉన్న తాళంతో తలుపులు తీసి లోపలికి ప్రవేశించిన నిందితుడు, టీవీ టేబుల్‌పై ఉన్న అల్మారా తాళాలతో లాకర్‌ను తెరిచి అందులోని సుమారు 14 తులాల బంగారు నగలను అపహరించాడు.
పోలీసుల వేట… నిందితుడి అరెస్ట్
సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన లక్ష్మి దంపతులు అల్మారా తెరిచి ఉండటం గమనించి నగలు మాయమైనట్లు తెలుసుకుని వెంటనే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు పత్రో శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు.
నిందితుడి వద్ద నుంచి ఒక బంగారు హారం, నల్లపూసల గొలుసు, మూడు పొరల గొలుసు, లాకెట్ ఉన్న గొలుసు, నాలుగు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల ముఖ్య సూచనలు
- తాళం చెవులను డోర్ మ్యాట్ కింద, షూ రాక్‌లో దాచవద్దు.
- కిటికీ సందుల్లో, డ్రమ్ముల వెనుక తాళాలు ఉంచడం ప్రమాదకరం.
- బయటకు వెళ్లేటప్పుడు అపరిచిత వ్యక్తులు గమనిస్తున్నారో లేదో జాగ్రత్తగా ఉండాలి.
ఈ సమావేశంలో జగద్గిరిగుట్ట సీఐ వెంకటేశం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
