TSRTC will launch 50 super luxury buses

ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు

ప్రయాణికులకు వేగమైన, సౌకర్యవంత సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణారంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ సూచనల మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో యాజమాన్యం కొత్త బస్సులను కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ₹ 392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటివిడతలో 630 సూపర్‌ లగ్జరీ, 130 డిలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది. ఈ బస్సులన్నీ మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై సూపర్‌ లగ్జరీ కొత్త బస్సుల ప్రారంభోత్సవం శనివారం మధ్యాహ్నం 2 గం. లకు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ జెండా ఊపి ప్రారంభించనున్నారు.