మట్టి పాత్రలు వాడండి – ఆరోగ్యాన్ని కాపాడుకోండి: అసెంబ్లీ ఆవరణలో ఉగాది కిట్లు అందజేసిన పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మట్టి పాత్రల వినియోగాన్ని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా “మట్టి పాత్రలు వాడండి – ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కుల వృత్తులను ప్రోత్సహించండి” అనే నినాదంతో అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, భట్టి విక్రమార్కలకు ఉగాది కిట్లు అందజేశారు.
ఈ ఉగాది కిట్లలో పండుగకు అవసరమైన మట్టి కుండా, గ్లాసులు, జగ్గు, బౌల్‌లతో పాటు షడ్రుచులను సూచించే మామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, చింతపండు, కారం వంటి పదార్థాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా నేతలు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంప్రదాయాలను పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. మట్టి పాత్రల వినియోగం ద్వారా ఆరోగ్యానికి మేలు కలగడంతో పాటు, సంప్రదాయ వృత్తులకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.
