గ్యాస్ కోసం ఇక లైన్లు అవసరం లేదు.. దేశంలో తొలి LPG ATM ప్రారంభం – క్షణాల్లో సిలిండర్ రీఫిల్
దేశంలో ఎల్పీజీ గ్యాస్ పంపిణీ వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇకపై గ్యాస్ సిలిండర్ కోసం రోజులు తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, కేవలం కొన్ని నిమిషాల్లోనే సిలిండర్ పొందే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) దేశంలో తొలిసారిగా LPG గ్యాస్ ATMను పైలట్ ప్రాజెక్టుగా గురుగ్రాంలో ఏర్పాటు చేసింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న వేళ, ఈ కొత్త సదుపాయం వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది. ఈ LPG ATM ద్వారా 24 గంటలూ గ్యాస్ అందుబాటులో ఉండటంతో, ఇకపై డెలివరీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
ఈ గ్యాస్ వెండింగ్ మెషీన్ పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి, OTP ద్వారా నిర్ధారణ చేసుకుని, UPI ద్వారా చెల్లింపు పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియ అనంతరం మెషీన్ నుంచి నిండిన సిలిండర్ బయటకు వస్తుంది. ఖాళీ సిలిండర్‌ను మెషీన్‌లోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ ATMలో లభించే సిలిండర్లు సంప్రదాయ ఇనుప సిలిండర్లకు భిన్నంగా ఉంటాయి. ఫైబర్‌తో తయారైన ఈ కాంపోజిట్ సిలిండర్లు తేలికగా, పరిశుభ్రంగా, తుప్పు పట్టని విధంగా ఉంటాయి. సాధారణంగా 31 కిలోల బరువు ఉండే సిలిండర్‌కు బదులుగా, ఇవి సుమారు 15 కిలోల బరువుతో ఉండటం వినియోగదారులకు సౌకర్యంగా మారింది. అంతేకాకుండా, సిలిండర్‌లో గ్యాస్ మిగిలిన పరిమాణం బయట నుంచే కనిపించేలా రూపొందించారు.
ఈ మెషీన్ ఒకేసారి సుమారు 10 సిలిండర్లను నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిల్వ తగ్గినప్పుడు సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి ఆటోమేటిక్ అలర్ట్ పంపే సౌకర్యం కూడా ఉంది.
టెక్నాలజీ ఆధారంగా గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు BPCL ఈ ప్రాజెక్టును చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే, దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా LPG ATMలను విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
