ఆదర్శ రాజకీయ నాయకుడు కొణిజేటి రోశయ్య.. ప్రజా ప్రయోజనాలే ఆయన రాజకీయాలకు పునాది: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి
రవీంద్రభారతిలో ఘనంగా రోశయ్య 93వ జయంతి వేడుకలు – తెలంగాణ ఉద్యమంలోనూ సమతుల్య సలహాలు ఇచ్చిన మహానేత అని నివాళి
హైదరాబాద్, జూలై 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా రవీంద్రభారతిలో నిర్వహించిన రోశయ్య 93వ జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోశయ్య రాజకీయ జీవితం ప్రజా ప్రయోజనాలకు అంకితమైందని కొనియాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైన విలువైన సూచనలు చేసేవారని గుర్తు చేశారు. ఆర్థిక మంత్రిగా సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఆయనకు స్పష్టమైన దార్శనికత ఉండేదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను, మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తుండగా, రోశయ్య ఎంతో హుందాగా సలహాలు ఇచ్చేవారని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ కోసం పోరాడాలని, అయితే రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా ఆలోచించాలని సూచించేవారని చెప్పారు. జైపూర్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ సమయంలో తీవ్ర నిరసనలు నెలకొన్నప్పటికీ, అది అభివృద్ధి కార్యక్రమమేనని వివరించి స్వయంగా కార్యక్రమానికి హాజరై అందరినీ అభినందించిన గొప్ప నాయకత్వం ఆయనదని ప్రశంసించారు.
పరిపాలనలో రోశయ్య సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. రాత్రివేళల వరకు సచివాలయంలో ఉండి ఫైళ్లను పూర్తిగా పరిశీలించి, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనే అంశాన్ని బేరీజు వేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి ఆయన అని కొనియాడారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి, బాధ్యతాయుత పరిపాలనకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా రోశయ్య చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
రోశయ్యతో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉందని మంత్రి తెలిపారు. తన తండ్రితో ఆయనకు ఎంతో సన్నిహిత సంబంధం ఉండేదని, తనను, వినోద్‌ను కూడా కుటుంబ సభ్యుల్లా ఆప్యాయంగా చూసేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన చూపిన ప్రేమాభిమానాలను జీవితాంతం మరచిపోలేమని పేర్కొన్నారు.
రోశయ్య జయంతి సభను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులకు, కుటుంబ సభ్యులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రస్ట్ ప్రతినిధులు, ప్రముఖులు, సాంస్కృతిక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
