లోక్‌సభ సీట్లు 50% పెంపు: డీలిమిటేషన్‌తో 815కు పెరుగనున్న సభ్యులు, మహిళలకు 33% రిజర్వేషన్
లోక్‌సభలో కీలక ప్రకటన చేస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం పెంచనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.
ఈ మార్పులతో రాష్ట్రాల నుంచి ఎన్నుకునే లోక్‌సభ సభ్యుల సంఖ్య 815కు పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం ఉండదని, జనాభా ఆధారంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
ఇదే సమయంలో మహిళల రాజకీయ సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో మొత్తం సీట్లలో మూడో వంతు (33%) మహిళలకు రిజర్వ్ చేయనుంది. దీనివల్ల మహిళా సభ్యుల సంఖ్య సుమారు 272కు చేరనుంది.
ఈ నిర్ణయం 2029 సాధారణ ఎన్నికల నుంచే అమల్లోకి రానుంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ను సవరించి, లోక్‌సభలో రాష్ట్రాల నుంచి గరిష్ట సభ్యుల సంఖ్యను 815కు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35కు పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి వంటి శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ రిజర్వేషన్ వర్తించేలా ప్రత్యేక బిల్లులు ప్రవేశపెట్టింది.
మహిళలకు కేటాయించే సీట్లు రొటేషన్ విధానంలో ప్రతి ఎన్నికలో మారుతాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ సీట్లలో కూడా మహిళలకు అంతర్గత రిజర్వేషన్ అమలు చేయనున్నారు.
కొత్తగా జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో భౌగోళిక సమీపత, పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. తాజా జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల సీట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత సమగ్రంగా, సమానత్వంతో ముందుకు తీసుకెళ్లడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
