సచివాలయం ఉద్యోగుల నిరసనకు ఊపుపీఆర్సీ, డీఏ బకాయిలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ సచివాలయం ప్రాంగణంలోని బాహుబలి గేటు వద్ద శుక్రవారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, పలు సంఘాల మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయం, లోక్ భవన్, అసెంబ్లీ తదితర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, క్లాస్-III, క్లాస్-IV ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన విరామ సమయంలో 12:30 గంటలకు ప్రారంభమైన ఈ నిరసనలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ (PRC) అమలు, డియర్నెస్ అలవెన్స్ (DA) బకాయిల విడుదల, విభాగాల వారీగా పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం సమగ్ర హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS) ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కూడా వారు కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులపై ఆర్థిక భారం పెరుగుతోందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జీతభత్యాలను సవరించడం ప్రభుత్వం బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. చివరగా, ఐకమత్యంతో హక్కులు సాధించుకోవాలని పిలుపునిస్తూ నిరసన కార్యక్రమాన్ని ముగించారు.
