ఇంటి పనులకు కానిస్టేబుల్ వినియోగం… ఖమ్మం సీఐపై విమర్శల వెల్లువ
ఖమ్మం: ట్రాఫిక్ నియంత్రణలో విధులు నిర్వహించాల్సిన కానిస్టేబుళ్లను ఇంటి పనులకు వినియోగించిన ఘటన ఖమ్మం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు.
వివరాల ప్రకారం, ఖమ్మం ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బదిలీ అయిన కానిస్టేబుల్ బాలాజీని విధుల నుంచి రిలీవ్ చేయకుండా తన వద్దనే ఉంచుకుని, ఇంటి పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఐ సొంత గ్రామం కేశావపురంలో కానిస్టేబుల్‌తో ఇంటి శుభ్రపరిచే పనులు చేయిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు, కొంతకాలంగా కానిస్టేబుల్‌తో ఇంటి పనులతో పాటు పెరటి శుభ్రత పనులు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు బయటకు రావడంతో సీఐపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా కింది స్థాయి ఉద్యోగులను వ్యక్తిగత పనులకు వినియోగించడం అధికార దుర్వినియోగమేనని, సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
