మహిళలకు వడ్డీలేని రుణాలు.. రైతుల చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
గజ్వేల్‌లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
సిద్దిపేట జిల్లా, గజ్వేల్ :
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన మంత్రి, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 30 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఆయన, ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. త్వరలో జర్మనీకి చెందిన 60 మంది ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు జర్మన్ భాషలో శిక్షణ అందించి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేసిన మంత్రి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
