జర్మనీతో తెలంగాణకు మరిన్ని ఉపాధి అవకాశాలు – ఏటీసీలు, టామ్‌కామ్ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలు: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడంలో జర్మనీతో భాగస్వామ్యం మరింత కీలకంగా మారనుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ-జర్మనీ మధ్య సమన్వయం పెరిగితే ఇరు ప్రాంతాలకు విశేష ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన పేర్కొన్నారు.
బుధవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జర్మనీలోని తురింగియా రాష్ట్రానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, పారిశ్రామిక సహకారం, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాల్లో కొత్త అవకాశాలను అన్వేషించేందుకు తెలంగాణ-జర్మనీ సంయుక్త సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు.
తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో వోయ్ట్, కార్మిక శాఖ మంత్రి షెంక్, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఈ బృందంలో పాల్గొన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా వారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. ఈ పర్యటనకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) సమన్వయం చేసింది.
సమావేశంలో విదేశీ ఉపాధి అవకాశాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరుల తయారీ, వర్క్‌ఫోర్స్ మొబిలిటీ, పారిశ్రామిక సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. జర్మనీలోని వివిధ రంగాల్లో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టామ్‌కామ్ చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) అభివృద్ధి చేస్తోందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టి దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసరమైన అత్యున్నత నైపుణ్యాలున్న యువశక్తిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టామ్‌కామ్ ద్వారా జర్మన్ భాషతో పాటు ఇతర విదేశీ భాషల శిక్షణను కూడా యువతకు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ ఉద్యోగాల్లో నియామకాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ, టామ్‌కామ్ చేస్తున్న కృషిని జర్మన్ ప్రతినిధి బృందం అభినందించింది.
ఈ సందర్భంగా టామ్‌కామ్ ద్వారా శిక్షణ పొందిన నర్సుల బృందం మంత్రి వివేక్ వెంకటస్వామి, జర్మన్ ప్రతినిధులతో సమావేశమైంది. భాషా శిక్షణ, విదేశీ ఉద్యోగ అవకాశాలు, ప్లేస్మెంట్ ప్రక్రియలపై తమ అనుభవాలను వారు పంచుకున్నారు. ఉన్నత స్థాయి జర్మన్ భాషా అర్హతలు సాధించిన ఈ నర్సులు త్వరలో టామ్‌కామ్ సహకారంతో జర్మనీలో ఉద్యోగాల్లో చేరనున్నారు.
ఎల్‌ఈటీఎఫ్ కార్యదర్శి దాసరి హరిచందన ఐఏఎస్, టామ్‌కామ్ అమలు చేస్తున్న శిక్షణా కార్యక్రమాల సాంకేతిక, నిర్వహణ అంశాలను వివరించారు. ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు పోటీ పడగల మానవ వనరులను తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆమె వివరించారు.
ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ ఐఏఎస్, టామ్‌కామ్ అధికారులు నాగభారతి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశం, నైపుణ్యాభివృద్ధి మరియు అంతర్జాతీయ ఉపాధి రంగాల్లో తెలంగాణ-జర్మనీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక ఘట్టంగా నిలిచింది.
