హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సమన్లు
ఫాంహౌస్ కూల్చివేతపై కోర్టు ధిక్కరణ పిటిషన్
డిసెంబర్ 4న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశం.. మరో ఐదుగురు అధికారులకూ నోటీసులు
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో ఫాంహౌస్, ఇతర నిర్మాణాల కూల్చివేతకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. డిసెంబర్ 4న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఆయనతో పాటు మరో ఐదుగురు ప్రభుత్వ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది.
ఐలాపూర్ గ్రామంలో తనకు 36.37 ఎకరాల భూమి ఉందని, అందులో నిర్మించిన ఫాంహౌస్, ఇతర కట్టడాలను అధికారులు కూల్చివేశారని 98 ఏళ్ల ఎం.ఏ. షరీఫ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు భూమిపై హక్కులు ఉన్నాయని నిరూపించే రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. నిర్మాణాలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటిని ఉల్లంఘించి అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు.
ఆరుగురు అధికారులకు నోటీసులు
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి టీకే శ్రీదేవితో పాటు సంగారెడ్డి జిల్లాకు చెందిన మరో నలుగురు అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
