జపాన్–తెలంగాణ సహకారానికి కొత్త దిశ..ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చలు
హైదరాబాద్, జూన్ 5: జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌కు చెందిన ప్రతినిధి బృందం శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు మరియు భూగర్భశాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారితో వారి కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశాన్ని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) సమన్వయం చేసింది.
సమావేశంలో జపాన్ ప్రతినిధులు వివిధ పరిశ్రమలు, రంగాల్లో భారత యువతకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల గురించి మంత్రికి వివరించారు. తెలంగాణ–జపాన్ మధ్య నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల విస్తరణ, శిక్షణ పొందిన మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాలపై పరస్పర సహకార అవకాశాలపై చర్చలు జరిగాయి.
హైదరాబాద్‌తో జపాన్ నగరాల అనుబంధానికి రెండు దశాబ్దాల చరిత్ర ఉందని, ప్రస్తుతం ఆ భాగస్వామ్యం 20వ సంవత్సరాన్ని జరుపుకుంటోందని ప్రతినిధి బృందం పేర్కొంది.
ఈ సందర్భంగా మంత్రి డా. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు. రాష్ట్ర యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, వారి ఉపాధి సామర్థ్యాలను పెంపొందించడంలో టామ్‌కామ్ అత్యంత వృత్తిపరమైన, లక్ష్యబద్ధమైన కృషి చేస్తోందని తెలిపారు.
జపాన్ సాంకేతిక నైపుణ్యం, పని సంస్కృతి తనను ఎంతో ఆకట్టుకున్నాయని మంత్రి పేర్కొన్నారు. జపాన్ యంత్రాల ఖచ్చితత్వంతో పాటు అక్కడి ప్రజల వినయం, క్రమశిక్షణ తనను ప్రభావితం చేశాయని అన్నారు.
ఈ సమావేశంలో లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ (LETF) శాఖ కార్యదర్శి దాసరి హరిచందన గారు తెలంగాణ అభివృద్ధి అవకాశాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ నైపుణ్యాల పెంపు, అంతర్జాతీయ ప్లేస్మెంట్ అవకాశాల గురించి వివరించారు. అలాగే తెలంగాణ–హిరోషిమా ప్రిఫెక్చర్ మధ్య సహకారం, ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు సంయుక్త కార్యాచరణ బృందం (జాయింట్ వర్కింగ్ గ్రూప్) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
హిరోషిమా ప్రిఫెక్చర్ మరియు నారా జపాన్ హబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో వచ్చిన బృందంలో:
శ్రీ ఫునైషి హిరోయోషి – డైరెక్టర్, ఇండస్ట్రియల్ హ్యూమన్ రిసోర్సెస్ డివిజన్
శ్రీ కోగా యుయా – సిబ్బంది, ఇండస్ట్రియల్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డివిజన్
శ్రీ హరజోనో యోషిహిరో – సూపర్వైజర్, లోకల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ డివిజన్
శ్రీమతి టోయి మారియా – సిబ్బంది, లోకల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ డివిజన్
తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
